బ్యాంకింగ్‌ బాదుడు.. రెడీగా ఉండండి, ఈ భారం కస్టమర్లదే!

1 Oct, 2022 12:26 IST|Sakshi

రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో ఈ రేటు 5.9 శాతానికి చేరింది. 2019 ఏప్రిల్‌ తర్వాత రెపో రేటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. కేంద్రం నిర్దేశిస్తున్న 6% రిటైల్‌ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా 4 సార్లు ఆర్‌బీఐ రెపోరేటు పెంచింది.

ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎస్‌బీఐ, బీవోఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌ఐసీ హౌసింగ్, హెచ్‌డీఎఫ్‌సీ రుణ రేట్ల పెంపు మొదలైంది. ఇటు ఆర్‌బీఐ అరశాతం రెపో పెంపు నిర్ణయం వెంటనే, అటు బ్యాంకింగ్‌ కూడా ఈ భారాన్ని కస్టమర్లపైకి మళ్లించాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీవోఐ), ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌ తమ రుణ రేట్లను 0.5% పెంచుతున్నట్లు ప్రకటించాయి. మరికొన్ని బ్యాంకులూ రేటు పెంపు బాటలో పయనించే అవకాశం ఉంది.

► ఎస్‌బీఐ ఈబీఎల్‌ఆర్‌ (ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేటు) 50  బేసిస్‌ పాయింట్లు పెరిగి 8.55 శాతానికి చేరింది. రెపో ఆధారిత ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ కూడా ఇదే స్థాయిలో ఎగసి 8.15 శాతానికి ఎగసింది. అక్టోబర్‌ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. 
► బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తక్షణం అమల్లోకి వచ్చే విధంగా రెపో ఆధారిత రేటును అరశాతం పెంచింది. దీనితో ఈ రేటు 8.75 శాతానికి ఎగసింది.


► ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేటు అరశాతం పెరిగి 9.60కి చేరింది. కొన్ని స్థిర డిపాజిట్ల రేట్లను కూడా మార్చుతున్నట్లు బ్యాంక్‌ తెలిపింది.
► హెచ్‌డీఎఫ్‌సీ తన రుణ రేటును  అరశాతం  పెంచింది. అక్టోబర్‌ 1 నుంచి పెంపు అమ ల్లోకి వస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది.

చదవండి: పండుగ బోనస్‌: భారీగా తగ్గిన కమర్షియల్‌ సిలిండర్‌!

మరిన్ని వార్తలు