రెపో రేటు పెంపు.. ఎవరికి మేలు.. ఎవరికి భారం ?

4 May, 2022 17:07 IST|Sakshi

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అత్యవసరంగా పెంచిన రెపోరేటు కొందరికి వరంగా మారంగా మరికొందరికి భారంగా మారనుంది. బ్యాంకులకు ఆర్బీఐ విధించే వడ్డీరేటును రెపోరేటుగా పేర్కొంటారు. సాధారణంగా నిధుల కొరత ఏర్పడినప్పుడు బ్యాంకులు ఆర్బీఐ నుంచి అప్పుగా తీసుకుంటాయి. వీటికి విధించే వడ్డీని రెపోరేటుగా చెప్పుకోవచ్చు. ఆర్బీఐ కనుక రెపోరేటును పెంచితే బ్యాంకులు సైతం తాము ఇచ్చే రుణాలపై ఈ వడ్డీ రేటును వర్తింప చేస్తాయి.

రిజర్వ్‌ బ్యాంక్‌ రెపోరేటు పెంచడంతో హోంలోన్‌, పర్సనల్‌ లోన్‌, వెహికల్‌ లోను వడ్డీరేట్లె పెరగనున్నాయి. ఇప్పటికే పాత వడ్డీరేటుతో తీసుకున్న వారిపై కూడా ఈ పెంపు భారం పడనుంది. ఆర్బీఐ వడ్డీరేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో రేపోరేటు 4 శాతం నుంచి 4.40 శాతానికి పెరిగింది. దీని ప్రకారం పాత వడ్డీ రేటు 0.40 శాతం పెరుగుతుంది. కొత్తగా రుణం తీసుకునే వారు అధికంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇక ఇప్పటికే రుణం తీసుకుని ఈఎంఐలు చెల్లిస్తున్న వారిపై నేరుగా వడ్డీ భారం పెరగకపోయినా.. పెరిగిన వడ్డీ రేటు సర్థుబాటులో భాగంగా అదనపు ఈఎంఐలు చెల్లించాల్సి వస్తుంది.

గత కొంత కాలంగా డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గించాయి. దీంతో చాలా మంది నగదు దాచుకునేందుకు బ్యాంకులకు ప్రత్యామ్నాయం చూస్తున్నారు. చిట్టీలు, రియల్టీ, స్టాక్‌మార్కెట్‌ వైపు మళ్లుతున్నారు. తాజాగా వడ్డీ రేట్ల పెంపుతో ఫిక్స్‌డ్‌, టర్మ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ లభించనుంది. ఆర్బీఐ తాజా నిర్ణయం వల్ల కమర్షియల్‌ బ్యాంకుల్లోకి నిధులు ప్రవహించే అవకాశం ఉంది. 

చదవండి: మూకుమ్మడిగా షాకిచ్చేందుకు సిద్ధమైన బ్యాంకులు..మరింత భారం కానున్న ఈఎంఐలు..ఎంతంటే..?

మరిన్ని వార్తలు