రూ.500 దొంగనోట్లు పెరుగుతున్నాయ్‌: తస్మాత్‌ జాగ్రత్త!

31 May, 2022 04:31 IST|Sakshi

2021-22పై ఆర్‌బీఐ గణాంకాలు

2020-21తో పోల్చితే రెట్టింపు

ముంబై: బ్యాంకింగ్‌ వ్యవస్థ మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో 79,669 రూ. 500 డినామినేషన్‌ నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ సంఖ్య రెట్టింపని ఆర్‌బీఐ వార్షిక నివేదిక తెలిపింది. ఇక రెండువేల నోట్ల విషయంలో గుర్తించిన నకిలీ సంఖ్య 13,604గా ఉంది. 2020–21తో పోల్చితే ఈ సంఖ్య 54.6 శాతం అధికం. 2016లో అమలులో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దు ప్రధాన లక్ష్యాలలో ఒకటి నకిలీ కరెన్సీ నోట్ల చెలామణిని అరికట్టడం కావడం గమనార్హం. కాగా, ఇందుకు సంబంధించి తాజా పరిస్థితి ఏమిటన్నది గణాంకాల్లో పరిశీలిస్తే...

► 2020–2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 2,08,625 నకిలీ నోట్లను గుర్తిస్తే, 2021–22లో ఈ సంఖ్య 2,30,971కి చేరింది.
► 2020–21తో పోల్చితే 2021–22లో రూ.10, రూ.20, రూ.200, రూ.500 (కొత్త డిజైన్‌), రూ. 2,000ల విలువ కలిగిన నకిలీ నోట్లలో వరుసగా 16.4 శాతం, 16.5 శాతం, 11.7 శాతం, 101.9 శాతం, 54.6 శాతం పెరుగుదల నమోదైంది.  
► అయితే ఇదే కాలంలో రూ.50, రూ.100 దొంగ నోట్లు వరుసగా 28.7%, 16.7% తగ్గడం గమనార్హం.  
► 2021–22లో గుర్తించిన మొత్తం నకిలీ నోట్లలో 6.9 శాతం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గుర్తించగా, 93.1 శాతం నోట్లను ఇతర బ్యాంకులు పసిగట్టాయి.  
► 2021 ఏప్రిల్‌ నుండి 2022 మార్చి 31 వరకు కరెన్సీ ప్రింటింగ్‌పై చేసిన మొత్తం వ్యయం రూ. 4,984.8 కోట్లు. అంతకుముందు సంవత్సరం (2020 జూలై 1 నుండి 2021 మార్చి 31 వరకు) ఈ మొత్తం రూ. 4,012.1 కోట్లు. 2021 మార్చికి ముందు ఆర్‌బీఐ జూలై–జూన్‌ మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించేది. అయితే 2021 ఏప్రిల్‌ నుంచి ‘ఏప్రిల్‌–మార్చి’ని ఆర్థిక సంవత్సరంగా మార్చారు.  
► 2021–22 ఆర్థిక సంవత్సరంలో పాడైపోయిన నోట్లను వెనక్కు తీసుకోడానికి సంబంధించిన సంఖ్య 88.4 శాతం పెరిగి 1,878.01 కోట్లకు చేరింది. 2020–21లో ఈ సంఖ్య 997.02 కోట్లు.

మరిన్ని వార్తలు