అందరిదీ ఆన్‌లైన్‌ బాటే!

25 May, 2022 13:24 IST|Sakshi

ఆన్‌లైన్‌లో క్రెడిట్‌ కార్డ్‌ లావాదేవీల జోరు 

స్వైపింగ్‌ కన్నా రూ. 30,000 కోట్లు అధికం 

ఆర్‌బీఐ మార్చి గణాంకాల్లో వెల్లడి  

న్యూఢిల్లీ: క్రెడిట్‌ కార్డులతో ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేసే ధోరణి భారీగా పెరుగుతోంది. పాయింట్స్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌)లో స్వైప్‌ చేయడంతో పోలిస్తే ఈ తరహా లావాదేవీలు మార్చిలో రూ. 30,000 కోట్ల పైగా అధికంగా నమోదయ్యాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం మార్చిలో 7.3 కోట్ల మంది క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్లు ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై రూ. 68,327 కోట్లు వెచ్చించారు. అదే పీవోఎస్‌ మెషిన్లలో స్వైపింగ్‌ చేయడం ద్వారా ఖర్చు చేసినది రూ. 38,377 కోట్లే. సంఖ్యాపరంగా చూస్తే ఆన్‌లైన్‌ క్రెడిట్‌ కార్డ్‌ లావాదేవీలు 11 కోట్లుగాను, ఆఫ్‌లైన్‌ లేదా పీవోఎస్‌ మెషిన్ల ద్వారా లావాదేవీలు కాస్త ఎక్కువగా 11.1 కోట్లుగా నమోదయ్యాయి. 

తొలిసారిగా..
ఆర్‌బీఐ ఇలా ఆన్‌లైన్, పీవోఎస్‌ చెల్లింపుల గణాంకాలను వేర్వేరుగా విడుదల చేయడం ఇదే తొలిసారి. మార్చిలో మొత్తం మీద క్రెడిట్‌ కార్డుల ద్వారా రూ. 1,07,100 కోట్ల మేర కొనుగోళ్లు జరిగాయి. నగదు విత్‌డ్రాయల్స్‌ దాదాపు రూ. 343.71 కోట్లుగా ఉన్నాయి.  

7.36 కోట్లకు క్రెడిట్‌ కార్డులు.. 
మార్చిలో కొత్తగా 19 లక్షల క్రెడిట్‌ కార్డులు జతవడంతో గత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి వీటి మొత్తం సంఖ్య 7.36 కోట్లకు చేరింది. కొత్త కార్డుల జారీపై ఆంక్షలు ఎదుర్కొన్నప్పటికీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుహోల్డర్ల సంఖ్య అత్యధికంగా 1.67 కోట్ల స్థాయిలో నమోదైంది. ఎస్‌బీఐ (1.37 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్‌ (1.29 కోట్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.   

చదవండి: మూడు రెట్లు పెరిగిన నష్టాలు,షేర్లు జంప్‌, టార్గెట్‌ ఎంతంటే?

మరిన్ని వార్తలు