నవంబర్‌ 5 కల్లా ఖాతాల్లో డబ్బులు

28 Oct, 2020 03:22 IST|Sakshi

‘చక్రవడ్డీ’పై బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు 

సుప్రీంకోర్టుకు కూడా కేంద్రం వెల్లడి

ముంబై/న్యూఢిల్లీ: మారటోరియంలో రుణాలపై చక్రవడ్డీ మాఫీ పథకాన్ని నవంబర్‌ 5లోగా అమలు చేయాలని బ్యాంకులు, నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశించింది. స్కీమ్‌కి అనుగుణంగా సాధారణ వడ్డీ, చక్రవడ్డీ మధ్య వ్యత్యాసానికి సంబంధించిన మొత్తాన్ని నిర్దిష్ట రుణగ్రహీతల ఖాతాల్లో గడువులోగా జమ చేసే ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. ‘రుణాలిచ్చే అన్ని ఆర్థిక సంస్థలు నిర్దిష్ట స్కీమ్‌ నిబంధనల ప్రకారం నిర్దేశిత గడువులోగా తగు చర్యలు తీసుకోవాలి‘ అని ఆదేశిస్తూ ఆర్‌బీఐ మంగళవారం ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఈ విషయాన్ని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. ‘6 నెలల వ్యవధికి సంబంధించి చక్రవడ్డీ, సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని ఎక్స్‌గ్రేషియాగా చెల్లించే స్కీము నిబంధనలను అమలు చేయాలంటూ ఆర్థిక సంస్థలకు ఆర్‌బీఐ సూచించింది‘ అని ఆమె పేర్కొన్నారు. మరోవైపు, ఇదే వివరాలను సుప్రీం కోర్టుకు కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేసింది. రుణగ్రహీతలు మారటోరియం ఎంచుకున్నా, ఎంచుకోకపోయినా లేదా పాక్షికంగా ఎంచుకున్నా .. అర్హులైన వారందరికీ ఈ స్కీమును వర్తింపజేస్తున్నట్లు వివరించింది. నిర్దిష్ట నిధులను రుణగ్రహీతల ఖాతాల్లో జమ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌కు బ్యాంకులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. ‘ఆర్థిక పరిస్థితులు, రుణగ్రహీతల తీరుతెన్నులు, ఎకానమీపై ప్రభావం తదితర అంశాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం‘ అని వివరించింది. 

నేపథ్యం ఇదీ.. 
కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిణామాలతో కుదేలైన రుణగ్రహీతలకు కాస్త వెసులుబాటునిచ్చే విధంగా రుణ బాకీల చెల్లింపును కొంతకాలం వాయిదా వేసుకునే వీలు కల్పిస్తూ ప్రభుత్వం మార్చి 1 నుంచి ఆగస్టు 31 దాకా ఆరు నెలల పాటు రెండు విడతలుగా మారటోరియం ప్రకటించింది. అయితే, ఈ వ్యవధిలో అసలుపై వడ్డీ మీద వడ్డీ కూడా వడ్డించే విధంగా బ్యాంకుల నిబంధనలు ఉన్నాయి. ఈ చక్రవడ్డీ భారాన్ని సవాలు చేస్తూ రుణగ్రహీతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో వారికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. సామాన్యుడి దీపావళి పండగ మీ చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా స్కీమ్‌ రూపొందించింది. 

స్కీమ్‌ ఇలా... 
రూ. 2 కోట్ల దాకా రుణాలకు ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. గృహ రుణాలు, విద్యా రుణాలు, క్రెడిట్‌ కార్డు బకాయిలు, వాహన రుణాలు, చిన్న..మధ్య తరహా సంస్థల లోన్స్, కన్జూమర్‌ డ్యూరబుల్‌ లోన్స్‌ మొదలైనవి దీని పరిధిలోకి వస్తాయి. పథకం ప్రకారం .. మారటోరియం ప్రకటించిన ఆరు నెలల కాలానికి గాను సాధారణ వడ్డీ, చక్ర వడ్డీకి మధ్య గల వ్యత్యాసాన్ని బ్యాంకులు ఆయా రుణ గ్రహీతల ఖాతాల్లో జమ చేస్తాయి. ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటాయి. మారటోరియంను ఎంచుకోకుండా యథాప్రకారం రుణాల నెలవారీ వాయిదాలను చెల్లించడం కొనసాగించిన వారికి కూడా ఇది వర్తిస్తుంది.

మరిన్ని వార్తలు