బ్యాంకు మోసాల కట్టడికి ఫ్రాడ్‌ రిజిస్ట్రీ

30 Aug, 2022 05:47 IST|Sakshi

ఆర్‌బీఐ పరిశీలనలో ప్రతిపాదన

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో మోసాలు తగ్గించేందుకు, కస్టమర్ల రక్షణ కోసం.. మోసాలకు సంబంధించి సమాచారంతో ఓ రిజిస్ట్రీని (ఫ్రాడ్‌ రిజిస్ట్రీ) ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ యోచిస్తోంది. ఇందులో మోసపూరిత వెబ్‌సైట్లు, ఫోన్‌ నంబర్లు, డిజిటల్‌ మోసాలకు పాల్పడే తీరు తదితర వివరాలు ఉంటాయి. ఆయా వెబ్‌సైట్లు, ఫోన్‌ నంబర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం ద్వారా మోసాలకు చెక్‌ పెట్టాలని ఆర్‌బీఐ చూస్తోంది. ఈ విషయాన్ని ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనిల్‌ కుమార్‌ శర్మ తెలిపారు. ఫ్రాడ్‌ రిజిస్ట్రీ ఏర్పాటుకు కచ్చితమైన సమయం ఇంకా అనుకోలేదని.. ప్రస్తుతం వివిధ భాగస్వాములు, విభాగాలతో సంప్రదింపులు నడుస్తున్నాయని చెప్పారు.

చెల్లింపుల వ్యవస్థలకు చెందిన భాగస్వాములు ఎప్పటికప్పుడు ఈ ఫ్రాడ్‌ రిజిస్ట్రీ సమాచారం పొందేలా అనుమతించాలన్నది యోచనగా చెప్పారు. కోర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ కస్టమర్లు రిజర్వ్‌బ్యాంకు సమగ్ర అంబుడ్స్‌మన్‌ పథకం పరిధిలోకి వస్తారని శర్మ తెలిపారు. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ఒకే దేశం ఒకే అంబుడ్స్‌మన్‌ను ప్రారంభించడం తెలిసిందే. 2021–22లో 4.18 లక్షల ఫిర్యాదులు అంబుడ్స్‌మన్‌ ముందుకు వచ్చాయని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 3.82 లక్షలుగా ఉన్నాయని వెల్లడించారు. గతేడాది 97.9 శాతం ఫిర్యాదులను పరిష్కరించినట్టు చెప్పారు. కస్టమర్లు తమ బ్యాంకు ఖాతా, కార్డుల వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, మోసం జరిగినట్టు గుర్తిస్తే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

మరిన్ని వార్తలు