డెబిట్/ క్రెడిట్ కార్డు దారులు ఇక అన్ని వివరాలు గుర్తు పెట్టుకోవాల్సిందే!

22 Aug, 2021 17:21 IST|Sakshi

గతంలో స్మార్ట్‌ఫోన్లు రాకముందు ల్యాండ్ లైన్ కాలంలో ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వ్యక్తుల నంబర్లను అలవోకగా గుర్తుపెట్టుకొనేది. ఎప్పుడైతే స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రతి చిన్న పనికి దాని మీద ఎక్కువ శాతం ఆధారపడుతున్నాము. ఇదంతా ఎందుకు మీకు చెబుతున్నాను అంటే.. ఆర్‌బీఐ కొత్తగా తీసుకోని రాబోయే  నిబంధనల వల్ల ఇక నుంచి ప్రతి ఖాతాదారుడు తమ 16 అంకెల డెబిట్/ క్రెడిట్ కార్డు నంబర్లతో పాటు సీవీవీ, గడువు తేదీ వంటి వివరాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 2022 జనవరి నుంచి ఈ కొత్త నిబందనలు అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 

కొన్ని నివేదికల ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) డేటా నిల్వ విధానంపై ఉన్న మార్గదర్శకాలను సవరించబోతోంది. ఈ సవరించిన నిబంధనల వల్ల పేమెంట్ అగ్రిగేటర్లు, ఈ-కామర్స్ వెబ్ సైట్లు, అమెజాన్ వంటి ఆన్ లైన్ వ్యాపారులు, ఫ్లిప్ కార్ట్, గూగుల్ పే, పేటిఎమ్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు వారి సర్వర్లలో కస్టమర్ల డెబిట్/ క్రెడిట్ కార్డు సమాచారాన్ని నిల్వచేయకూడదు. దీని వల్ల ఇక నుంచి పేమెంట్ చేయాలని అనుకున్న ప్రతిసారీ మీ కార్డు పూర్తి వివరాలు(పేరు, 16 అంకెల కార్డు నెంబరు, గడువు తేదీ, సీవీవీ)ను నమోదు చేయాల్సి ఉంటుంది.(చదవండి: తాలిబన్లతో చైనా దోస్తీ..! భారీ పన్నాగమేనా..!)

అయితే, ఈ కొత్త నిబంధనలలో మార్పు చేయాలని సంస్థలు ఆర్‌బీఐని కోరాయి. వినియోగదారుల డేటా నిల్వకు సంబంధించి పేమెంట్ గేట్ వే కంపెనీలు చేసిన ప్రతిపాదనలను ఆర్‌బీఐ తిరస్కరించింది. ఈ కొత్త నిబంధనల వల్ల వినియోగదారుడి సెక్యూరిటీ వివరాలు థర్డ్ పార్టీ సర్వర్లలలో ఉండవు కాబట్టి వారి డేటాను దొంగలించే ఆస్కారం ఉండదు అని ఆర్‌బీఐ భావిస్తుంది.  

మరిన్ని వార్తలు