నష్టాల్లోకి ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌

3 Aug, 2021 04:31 IST|Sakshi

రూ. 459 కోట్లు 

ప్రయివేట్‌ రంగ సంస్థ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో రివర్స్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. వెరసి క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో రూ. 459 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. గతేడాది (2020–21) ఇదే కాలంలో రూ. 141 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు ప్రొవిజన్లు పెరగడం ప్రభావం చూపింది. కోవిడ్‌–19 నేపథ్యంలో స్థూల స్లిప్పేజెస్‌ 97 శాతం ఎగసి రూ. 1,342 కోట్లను తాకాయి. గత క్యూ1తో పోలిస్తే స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.45 శాతం నుంచి 4.99 శాతానికి పెరిగాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 500 కోట్ల నుంచి రూ. 1,425 కోట్లకు జంప్‌చేశాయి. కోవిడ్‌–19కు రూ. 600 కోట్ల అదనపు కేటాయింపులు చేపట్టకపోతే క్యూ1లో లాభాలు ప్రకటించడం సాధ్యమయ్యేదని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవో విశ్వవీర్‌ అహుజా పేర్కొన్నారు. పునర్వ్యవస్థీకరించిన రుణాలు రూ. 933 కోట్ల నుంచి రూ. 1,162 కోట్లకు పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం 7 శాతం క్షీణించి రూ. 970 కోట్లకు పరిమితంకాగా.. నికర వడ్డీ మార్జిన్లు 4.9 శాతం నుంచి 4.4 శాతానికి నీరసించాయి. కనీస మూలధన నిష్పత్తి 17.15 శాతానికి చేరింది. 
ఫలితాల నేపథ్యంలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం బలపడి రూ. 195 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు