రియల్‌ ఎస్టేట్‌ మళ్లీ జోరందుకుంది

26 Jan, 2021 03:25 IST|Sakshi

కోవిడ్‌ ప్రతికూలతను అధిగమించిన రంగం

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఊపందుకున్న వెంచర్ల రిజిస్ట్రేషన్లు..

చకచకా భవన నిర్మాణాలకు అనుమతులు 

ఆన్‌లైన్‌ విధానంలో సరళంగా అనుమతుల ప్రక్రియ 

లేఅవుట్ల రిజిస్ట్రేషన్లలో వీఎంఆర్‌డీఏ అగ్రస్థానం

భవన నిర్మాణంలో విశాఖ, కృష్ణా టాప్‌ 

సాక్షి, అమరావతి:  కోవిడ్‌ ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం మళ్లీ వేగం పుంజుకుంది. లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు, భవన నిర్మాణ అనుమతుల జారీ ఊపందుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కరోనా మహమ్మారి వ్యాప్తితో రియల్‌ ఎస్టేట్‌ లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ దాదాపుగా స్తంభించిపోయింది. ఆ తర్వాత క్రమంగా లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో గత ఏడాది ద్వితీయార్థం నుంచి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల రిజిస్ట్రేషన్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా అన్నిరకాల అనుమతులను నిర్ణీత కాలంలో జారీచేస్తుండడం కూడా ఇందుకు దోహదపడుతోంది.

ఆన్‌లైన్‌లో అనుమతులు
రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు అన్నింటికీ పురపాలక శాఖ ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా అత్యంత పారదర్శకంగా అనుమతులు జారీచేస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ లే అవుట్లకు అయితే 21 రోజుల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసి అనుమతులివ్వాలి. అపార్టుమెంట్లు, ఇతర భవన నిర్మాణాలకు 15 రోజుల్లోనే అనుమతులు జారీచేయాలి. ఆ నిర్ణీత గడువు ముగియగానే ‘డీమ్డ్‌ టు బి అప్రూవ్డ్‌’గా.. అంటే, అనుమతులు జారీ అయినట్లుగానే పరిగణించేలా కూడా విధాన నిర్ణయం తీసుకున్నారు. ఇది రియల్టర్లతోపాటు సామాన్య భవన నిర్మాణదారులకు కూడా ఎంతో సానుకూలంగా ఉంది.

రాష్ట్రంలో 15 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే.. 2018–19లో 613 ఎకరాల్లో కేవలం 98 లేఅవుట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అదే.. 2019–20లో 2,777 ఎకరాల్లో 326 లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. వైఎస్సార్‌సీపీ సర్కారు వచ్చాక రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు మూడు రెట్లు పెరిగాయి. ఈ కాలంలో ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవడంతో రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇక 2020–21లో కరోనా మహమ్మారి ప్రతికూల పరిస్థితులను అధిగమించి మరీ రికార్డు స్థాయిలో లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు చేయడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి 21 నాటికి ఏకంగా 2,633 ఎకరాల విస్తీర్ణంలో 330 లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి దాదాపు 500 లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. ఈ ఏడాది లేఅవుట్ల రిజిస్ట్రేషన్లలో  విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ)  మొదటిస్థానంలో కొనసాగుతోంది. 

అలాగే, రాష్ట్రంలో 110 పట్టణ స్థానిక సంస్థల్లో.. 44 ప్రధాన మున్సిపాల్టీల్లో 2018–19లో కేవలం 29 లేఅవుట్లకు 150 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు అయ్యాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి ఉరకలెత్తడంతో రియల్‌ ఎస్టేట్‌ రంగం వేగం పుంజుకుంది. 2019–20లో 65 లేఅవుట్లకు 428 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు చేశారు. అలాగే, 2020–21లో కరోనా పరిస్థితులను అధిగమిస్తూ జనవరి 21నాటికి 55 లేఅవుట్లకు 317 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 550 ఎకరాల్లో 75 లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు అవుతాయని భావిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో కూడా అదే తీరులో రియల్‌ ఎస్టేట్‌ జోరు కొనసాగుతోంది. 2018–19లో 897 ఎకరాల్లో 175 లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు కాగా.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక 2019–20లో 176 లేఅవుట్లకు 1,284 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు కావడం గమనార్హం. 2020–21లో ఇప్పటికే 73 లేఅవుట్లకు 460 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు చేశారు.

భవన నిర్మాణాల్లోనూ విశాఖ, కృష్ణా ముందంజ
రాష్ట్రంలో అపార్ట్‌మెంట్లు, ఇతర భవనాలు, ఇళ్ల నిర్మాణం కూడా ఊపందుకుంది. మున్సిపల్‌ శాఖ రికార్డు స్థాయిలో భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తుండటమే ఇందుకు నిదర్శనం. 
రాష్ట్రంలో 15 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో 2020, జనవరి 20 నాటికి 2,136 భవన నిర్మాణ అనుమతులు జారీచేశారు. 
ఇక రాష్ట్రంలోని 110 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 2020, జనవరి 20 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1,59,574 అపార్టుమెంట్లు, ఇతర భవనాలు, ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 1,42,507 దరఖాస్తులకు అనుమతులు జారీచేశారు. 
వీటిలో 20,197 అనుమతులతో విశాఖ జిల్లా మొదటిస్థానంలో ఉంది.
17,247 భవన నిర్మాణ అనుమతులతో ‘కృష్ణా’ రెండో స్థానంలో.. 
15,247 అనుమతులతో పశ్చిమ గోదావరి జిల్లా మూడో స్థానంలో ఉంది.

ఆక్యుపెన్సీ రేటూ పెరిగింది
రాష్ట్రంలో మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల పరిధిలోని కొత్త భవన నిర్మాణాల్లో ఆక్యుపెన్సీ కూడా బాగా పెరుగుతోంది. పురపాలక శాఖ అన్ని అనుమతులు ఆన్‌లైన్‌ విధానంలో జారీచేస్తుండటం రియల్టర్లు, సామాన్యులకు సౌలభ్యంగా మారింది. వార్డు సచివాలయాలు కేంద్రంగా కార్యకలాపాలు సాగుతుండటంతో నిర్మించిన భవనాలను పరిశీలించి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీచేయడం సరళంగా మారింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో జనవరి 21 నాటికి రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల పరిధిలో ఆక్యుపెన్సీ ఫీజుల రూపంలో రూ.6.68 కోట్ల ఆదాయం సమకూరింది. 15 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో రూ.3.703 కోట్లు వసూలైంది. కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ పురపాలక శాఖకు ఆక్యుపెన్సీ ఫీజుల రూపంలో రూ.10.39 కోట్లు ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక ఏడాది ముగిసేనాటికి దాదాపు రూ.12కోట్లు సమకూరుతుందని ఆ శాఖ అంచనా వేస్తోంది. గత నాలుగేళ్లలో ఆక్యుపెన్సీ ఫీజుల్లో ఇదే అత్యధికం.

ఆక్యుపెన్సీ దరఖాస్తులకూ అనుమతులు
ఇక 2020–21లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇప్పటివరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ల కోసం ఇంతవరకు 2,893 దరఖాస్తులు రాగా వాటిలో 2,572 దరఖాస్తులకు అనుమతులు జారీచేశారు. తద్వారా రాష్ట్రంలో కొత్తగా 19,242 గృహ యూనిట్లు వాడుకలోకి వచ్చాయి. 15 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం వచ్చిన 112 దరఖాస్తులతో 100 దరఖాస్తులకు అనుమతులు జారీచేశారు. తద్వారా కొత్తగా 2,207 గృహ యూనిట్లు వాడుకలోకి వచ్చాయి. ఈ విషయంలో విశాఖ మొదటి స్థానంలో ఉండగా.. కృష్ణా, గుంటూరు జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

సరళంగా అనుమతుల ప్రక్రియ 
పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో అన్ని రకాల అనుమతులు నిర్ణీత వ్యవధిలో పారదర్శకంగా జారీచేస్తున్నాం. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కూడా మళ్లీ గాడిలో పడింది. దాంతో లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు, భవన నిర్మాణ అనుమతులు వేగం పుంజుకున్నాయి. టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి సంబంధించి అన్ని అనుమతులు వార్డు సచివాలయాల ద్వారా జారీ చేస్తుండటంతో సామాన్యులకు సౌలభ్యంగా ఉంది. 
– వి.రాముడు, డైరెక్టర్, పట్టణ ప్రణాళిక విభాగం

మళ్లీ మంచి రోజులు 
రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకుంటోంది. కొత్త వెంచర్లు, అపార్టుమెంట్ల నిర్మాణం ఊపందుకుంటోంది. స్వస్థలాలకు వెళ్లిపోయిన భవన నిర్మాణ కార్మికులు కూడా తిరిగి వస్తున్నారు. రియల్టర్లు చెల్లిస్తున్న లేబర్‌ సెస్‌ను ‘రెరా’ కార్మికులకు విడుదల చేస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుంది. నిర్మాణ సామగ్రి ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – మద్దులూరి హరి ప్రేమ్‌నాథ్, అధ్యక్షుడు, క్రెడాయ్, ఒంగోలు శాఖ 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు