ఆల్‌టైమ్‌ గరిష్టానికి రియల్టీ సెంటిమెంట్‌

21 Apr, 2022 04:51 IST|Sakshi

68 పాయింట్లకు చేరిక

వచ్చే ఆరు నెలల కాలానికీ సానుకూలమే

నైట్‌ఫ్రాంక్‌–నరెడ్కో నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సెంటిమెంట్‌ 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరినట్టు నైట్‌ ఫ్రాంక్‌ నరెడ్కో సర్వేలో వెల్లడైంది. వచ్చే ఆరు నెలల కాలానికి సైతం బుల్లిష్‌గా ఉన్నట్టు డెవలపర్లు వెల్లడించారు. ఇళ్లకు, వాణిజ్య ప్రాజెక్టులకు డిమాండ్‌ బలంగా ఉండడంతో ప్రస్తుత, భవిష్యత్తు సెంటిమెంట్‌ ఇండెక్స్‌ నూతన రికార్డు స్థాయికి చేరినట్టు నైట్‌ఫ్రాంక్‌–నరెడ్కో విడుదల చేసిన ‘రియల్‌ ఎస్టేట్‌ సెంటిమెంట్‌ ఇండెక్స్‌’ తెలియజేసింది.

ప్రస్తుత సెంటిమెంట్‌ (డెవలపర్ల వైఖరి) నూతన గరిష్ట స్థాయి 68కి చేరుకోవడం డెవలపర్లు వారి ప్రాజెక్టుల విషయంలో సానుకూలంగా ఉన్నట్టు తెలియజేస్తోందని ఈ సర్వే నివేదిక తెలిపింది. భవిష్యత్తు సెంటిమెంట్‌ స్కోరు కూడా రికార్డు స్థాయిలో 75కు చేరింది. వచ్చే ఆరు నెలల కాలానికి కూడా డెవలపర్లు, ఇన్వెస్టర్లు రియల్‌ ఎస్టేట్‌ పట్ల సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. 50కు పైన స్కోరును ఆశావాదంగాను, 50 స్థాయిలో ఉంటే తటస్థంగా, 50కు దిగువన నిరాశావాదంగా పరిగణిస్తారు.

రానున్న రోజుల్లో మరింత జోరు  
‘‘ప్రస్తుత సెంటిమెంట్‌ స్కోరు 2021 నాలుగో త్రైమాసికంలో 65గా ఉంటే, 2022 మొదటి మూడు నెలల్లో 68కి పెరిగింది. రియల్‌ ఎస్టేట్‌లో ఎక్కువ మంది భాగస్వాములకు గత ఆరు నెలల్లో మార్కెట్‌ ఎంతో సానుకూలంగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ మూడో విడతను అధిగమించింది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం అనిశ్చితి ప్రభావాలేవీ రియల్‌ ఎస్టేట్‌ మీద చూపించలేదు’’అని ఈ నివేదిక పేర్కొంది. కరోనా విపత్తుతో స్తబ్దుగా మారిన వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ కూడా వృద్ధిని చూస్తున్నట్టు తెలిపింది.

కరోనా ప్రొటోకాల్స్‌ అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఎత్తి వేసినందున రానున్న రోజుల్లో రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ మంచి జోరు చూపించొచ్చని నివేదిక అంచనా వేసింది. ‘‘నివాస గృహాల మార్కెట్‌లో వృద్ధి ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ రంగం అంతటా సెంటిమెంట్‌ సానుకూలంగా ఉంది. చాలా కంపెనీలు తమ సిబ్బందిని తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కోరుతున్నాయి. దీంతో ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ కూడా క్రమంగా వృద్ధి చెందుతోంది’’అని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్‌ బజాజ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు