లగ్జరీ విల్లాలకు ఊపు: ఎన్‌ఆర్‌ఐ, బడాబాబులే తోపు

22 Oct, 2022 12:03 IST|Sakshi

కరోనాతో విల్లాలకు డిమాండ్‌

శివారు ప్రాంతాలలో జోరుగా విల్లా ప్రాజెక్ట్‌లు 

ఎన్నారై, హెచ్‌ఎన్‌ఐ కొనుగోళ్ల వృద్ధి 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి తర్వాత విల్లాలకు ఊపొచ్చింది. సామాన్య, మధ్యతరగతితో పోలిస్తే కరోనా మహమ్మారి లగ్జరీ గృహ కొనుగోలుదారుల మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. ఫలితంగా ఈ విభాగం గృహ విక్రయాలలో వృద్ధి నమోదవుతుంది. ఎక్స్‌ఛేంజ్‌ రేటు తక్కువగా ఉండటం మూలంగా ప్రవాసులు, హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ) లగ్జరీ గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు డెవలపర్లు అందించే డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఆయా వర్గాల కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. 


ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 1.84 లక్షల గృహాలు విక్రయం కాగా.. ఇందులో 14 శాతం అంటే  25,680 ఇళ్లు లగ్జరీ గృహాలే అమ్ముడుపోయాయని అనరాక్‌ గ్రూప్‌ సర్వే వెల్లడించింది. అదే కరోనా కంటే ముందు 2019 ఏడాది మొత్తం చూస్తే.. 2.61 లక్షల యూనిట్లు విక్రయం కాగా.. కేవలం 3 శాతం అంటే 17,740 యూనిట్లు మాత్రమే లగ్జరీ గృహాలున్నాయని పేర్కొంది. 

లాంచింగ్‌లోనూ లగ్జరే.. 
డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉంటుందన్న సూత్రం ప్రకారమే.. డెవలపర్లు కూడా ప్రాజెక్ట్‌ లాంచింగ్‌లలో లగ్జరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 2019లో 28,960 విలాసవంతమైన ఇళ్లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరం నాటికే ఏకంగా 28 వేల లగ్జరీ గృహాలను లాంచింగ్‌ చేశారు.   

పశ్చిమంలో హవా.. 
హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్‌లో పశ్చిమాది ప్రాంతాలదే హవా కొనసాగుతోంది. గత మూడు త్రైమాసికాల నుంఇచ కొత్త ప్రాజెక్ట్స్‌ లాంచింగ్స్‌ పశ్చిమ హైదరాబాద్‌లో 57 శాతం జరిగాయి. ఉత్తరాదిలో 18 శాతం, తూర్పులో 15 శాతం, సెంట్రల్‌లో 8 శాతం, సౌత్‌ హైదరాబాద్‌లో 2 శాతం లాంచింగ్స్‌ జరిగాయి. వెస్ట్‌ హైదరాబాద్‌లో తెల్లాపూర్, బాచుపల్లి, సౌత్‌లో అత్తాపూర్‌లు రియల్టీ హాట్‌స్పాట్స్‌గా మారాయి. ఓపెన్‌ ప్లాట్లలో పెట్టుబడులు పెట్టే బదులు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు చాలా మంది కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు.  

వృద్ధి కారణాలివే.. 
2019 నుంచి 2022 హెచ్‌1తో పోలిస్తే రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ గృహాల విక్రయాలలో రెండింతల వృద్ధి నమోదయింది. 2022 హెచ్‌1లో అత్యధిక లగ్జరీ గృహాలు అమ్ముడుపోయింది ముంబైలోనే. ఇక్కడ 13,670 యూనిట్లు సేలయ్యాయి. ఆ తర్వాతి ఎన్‌సీఆర్‌లో 4,160 ఇళ్లు అమ్ముడుపోయాయి. 2019లో ఈ రెండు నగరాలలో 11,890 విలాసవంతమైన ఇళ్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరంలోనే 17,830 యూనిట్లు విక్రయమయ్యాయి. 2019 నుంచి 2022 హెచ్‌ 1తో పోలిస్తే ముంబైలో లగ్జరీ గృహాల అమ్మకాలు 13 శాతం 25 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో ఎన్‌సీఆర్‌లో 4 శాతం నుంచి 12 శాతానికి వృద్ధి చెందాయి.      

మరిన్ని వార్తలు