Reality: రియల్టీలో పెట్టుబడుల జోరు

9 Jul, 2021 11:22 IST|Sakshi

ఏప్రిల్‌–జూన్‌లో 1.35 బిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ 

గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 9 రెట్ల వృద్ధి 

జేఎల్‌ఎల్‌ ఇండియా రిపోర్ట్‌ వెల్లడి  

హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సంస్థాగత పెట్టుబడులు (ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌) ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికం (క్యూ2)లో 9 రెట్ల వృద్ధితో 1.35 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. గిడ్డంగుల విభాగంలోకి నిధుల ప్రవాహమే ఈ వృద్ధికి కారణమని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ తెలిపింది. అంతకుక్రితం ఏడాదిలో ఈ పెట్టుబడులు 155 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయని జేఎల్‌ఎల్‌ ఇండియా క్యాపిటల్‌ మార్కెట్స్‌ అప్‌డేట్స్‌ క్యూ2–2021 రిపోర్ట్‌ వెల్లడించింది. గతేడాది క్యూ2లో వేర్‌హౌస్‌ విభాగంలోకి 41 మిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ రాగా.. ఈ ఏడాది క్యూ2 నాటికి 743 మిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఇతర విభాగాలలో చూస్తే.. రిటైల్‌ రంగం 278 మిలియన్‌ డాలర్లు, ఆఫీస్‌ స్పేస్‌ 231 మిలియన్‌ డాలర్ల ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించాయి. 2020 క్యూ2లో ఆఫీస్‌ స్పేస్‌లోకి 66 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులొచ్చాయి. ఇక నివాస విభాగంలోకి గతేడాది క్యూ2లో 48 మిలియన్‌ డాలర్లు రాగా.. ఇప్పుడవి 106 మిలియన్‌ డాలర్లకు పెరిగాయి. 


పారదర్శకతతో వృద్ధి... 
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) నిబంధనలలో సడలింపులతో పాటు రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్స్‌), రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ యాక్ట్‌ (రెరా), బినామీ లావాదేవీల చట్టాలతో గత దశాబ్ధ కాలంగా రియల్టీ పెట్టుబడులు, లావాదేవీలలో పారదర్శకత, వేగం పెరిగాయని జేఎల్‌ఎల్‌ కంట్రీ హెడ్‌ అండ్‌ సీఈఓ రాధా ధీర్‌ తెలిపారు. 
 

మరిన్ని వార్తలు