ఎలక్ట్రిక్ మార్కెట్‌లోకి మరో మొబైల్ దిగ్గజ కంపెనీ

28 Oct, 2021 15:07 IST|Sakshi

భవిష్యత్తు రవాణా రంగంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ ఒక గమ్య స్థానంగా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం వాహన మార్కెట్లో ఉన్న దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వైపు ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొనివచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. అలాగే, కొత్త స్టార్టప్ కంపెనీలు కూడా ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం  షావోమీ కూడా ఎలక్ట్రిక్‌ వాహానాల తయారీపై దృష్టిసారించింది. ఎలక్ట్రిక్‌ కార్లను 2024 ప్రథమార్థంలో లాంచ్‌ చేయనున్నట్లు షావోమీ ఒక ప్రకటనలో పేర్కొంది. 

ఎలక్ట్రిక్ మార్కెట్‌లోకి రియల్‌మీ
తాజాగా వస్తున్న సమాచార ప్రకారం ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ రియల్‌మీ, ఎలక్ట్రిక్ వేహికల్(ఈవీ) మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రపంచంలో అత్యంత పాపులర్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో రియల్‌మీ ఒకటి. కంపెనీ ఏప్రిల్ 2021లో ఒక మిలియన్ యూనిట్లను విక్రయించింది. 100 మిలియన్ స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేసిన అత్యంత వేగవంతమైన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా రియల్‌మీ నిలిచింది. ఈ ఘనతను కేవలం 37 నెలల వ్యవధిలో సాధించింది. చైనాతో పాటు భారతదేశంలో కూడా రియల్‌మీకి బలమైన మార్కెట్ ఉంది. ఈ కంపెనీ కొద్ది రోజుల క్రితం 'రియల్‌మీ టెక్ లైఫ్' బ్రాండ్ పేరుతో మనదేశంలో ట్రేడ్ మార్క్ చేసింది. ఆసక్తికర విషయం ఏమిటంటే రియల్‌మీ మొబైల్ టెలికమ్యూనికేషన్స్(షెన్ జెన్)కో లిమిటెడ్ ఈ ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకుంది.

(చదవండి: రేషన్‌ షాపుల్లో ముద్రా లోన్‌ సేవలు)

ప్రస్తుతం ద్విచక్ర వాహనాల ఈవీల ఉత్పత్తిలో చైనా అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. సమీప భవిష్యత్తులో ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్ సైకిళ్లకు భారతదేశం గమ్యస్థానంగా మారే అవకాశం ఉండటంతో రియల్‌మీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రిక్ వేహికల్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు కంపెనీ ఆలోచన చేస్తున్నట్లు ట్రేడ్ మార్క్ నిరుపిస్తుంది. కంపెనీ సొంతంగా వెళ్తుందా లేదా మరో మొబిలిటీ సంస్థతో భాగస్వామ్యాన్ని ఏర్పరిస్తుందా అనేది ఇంకా తెలీదు. రియల్‌మీ ప్రారంభంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లోకి ప్రవేశిస్తుందని సమాచారం. అయితే, దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. 

(చదవండి: ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం)

మరిన్ని వార్తలు