రియల్‌మీ నుంచి ల్యాప్‌టాప్‌..ఆపిల్‌ మాక్‌బుక్‌ను పోలి ఉన్న ఫినిషింగ్‌..!

9 Jun, 2021 21:15 IST|Sakshi

కోవిడ్‌-19 మహమ్మారి రాకతో ల్యాప్‌టాప్‌ల మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందింది. ప్రజలు ఎక్కువగా వర్క్‌ ఫ్రమ్‌ హోంకే పరిమితమవ్వడంతో ల్యాప్‌టాప్‌ సేల్స్‌ భారీగా పెరిగాయి. ఆసుస్, డెల్, హెచ్‌పి, లెనోవో వంటి ల్యాప్‌టాప్‌ కంపెనీల కొనుగోళ్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా ఈ కంపెనీలు భారీగా లాభాలను ఆర్జించాయి.  దీంతో ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు కూడా ల్యాప్‌టాప్‌ల తయారీపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రియల్‌మీ కూడా ల్యాప్‌టాప్‌ ఉత్పత్తిపై దృష్టిసారించింది. కాగా త్వరలోనే రియల్‌మీ నుంచి ల్యాప్‌టాప్‌ రిలీజ్‌ అవుతుందని కంపెనీ సీఈఓ మాధవ్‌ శేత్‌ ట్విటర్‌లో పోస్ట్‌చేశాడు.

2008 లో స్టీవ్ జాబ్స్ మొదటి తరం మాక్‌బుక్ ఎయిర్‌ను ఎలా ఆవిష్కరించారనే విషయాన్ని గుర్తుచేస్తూ, పేపర్‌బ్యాగ్‌లో ఉన్న రియల్‌మీ ల్యాప్‌టాప్‌ ఉన్న చిత్రాన్ని పోస్ట్‌ చేశాడు. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ షావోమీకు చెందిన ల్యాప్‌టాప్‌లకు పోటీగా,  రియల్‌మీ ల్యాప్‌టాప్‌ను రిలీజ్‌ చేయనుంది. రియల్‌మీ కంపెనీ భారత్‌, యూరప్‌ సీఈవో మాధవ్‌శేత్‌ తన ట్విటర్‌ ఖాతా నుంచి హల్లో వరల్డ్‌ అనే ఒక క్రిప్టిక్‌ మెసేజ్‌ను తెలుపుతూ చిత్రాన్ని పోస్ట్‌ చేశాడు. కాగా చిత్రంలో రియల్‌మీ ల్యాప్‌టాప్‌ ఆపిల్‌ మాక్‌బుక్‌ మాదిరిగానే ఫినిషింగ్‌ కల్గి ఉన్నట్లుగా తెలుస్తోంది.ల్యాప్‌టాప్‌ బాడీ అల్యూమినియం లేదా ప్లాస్టిక్‌తో తయారుచేశారనే విషయంలో కాస్త అస్పష్టత నెలకొంది.

చదవండి: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ వచ్చేశాయి.. మొబైల్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..!

మరిన్ని వార్తలు