బిల్డర్‌ ప్రొఫైల్‌ చూడకుండా ఇళ్లు, ఫ్లాట్స్‌ కొనొద్దు !

1 Jan, 2022 09:15 IST|Sakshi

నగర రియల్టీపై కరోనా కంటే యూడీఎస్‌ ప్రభావమే ఎక్కువ 

రెరా కార్యాచరణ, వడ్డీ రేట్లపై ఆధారపడే ఈ ఏడాది భవిష్యత్తు 

సామర్థ్యాన్ని అంచనా వేశాకే ప్రాజెక్ట్‌లు చేపట్టాలి 

డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్లను రిజిస్ట్రేషన్‌ చేయొద్దు 

బిల్డర్‌ ప్రొఫైల్‌ చూడకుండా కొనొద్దు  

పారదర్శకత, సమాన అవకాశాలు ఉన్న ఏ రంగమైనా సక్సెస్‌ అవుతుంది. రియల్టీ పరిశ్రమకూ ఇదే వర్తిస్తుంది. గతేడాది ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వెంటాడితే.. హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్‌ను మాత్రం యూడీఎస్‌ భూతం మింగేసింది. అనధికారిక విక్రయాలతో ఆరోగ్యకరమైన మార్కెట్‌ దెబ్బతిన్నది. సిండికేట్‌గా మారిన కొందరు డెవలపర్లు.. నగర రియల్టీ మార్కెట్‌ను ప్రతికూలంలోకి నెట్టేశారు. ప్రభుత్వంతో పాటూ డెవలపర్ల సంఘాలు, స్టేక్‌ హోల్డర్లు, నిపుణులు ఒక్క తాటిపైకొస్తేనే హైదరాబాద్‌ స్థిరాస్తి రంగానికి నూతన సంవత్సరం! 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మాలతో పాటూ బ్యాంకింగ్, సర్వీసెస్‌ రంగాలన్నీ బాగున్నాయి. కరోనా కాలంలోనూ ఆయా పరిశ్రమ లలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. స్థిరౖ మెన ఆదాయ వృద్ధి నమోదవుతుంది. మరోవైపు ఇతర నగరాల కంటే హైదరాబాద్‌లో జీవన వ్యయం తక్కువ. అందుబాటు ధరలు, కాస్మోపాలిటన్‌ సిటీ, ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలతో వ్యక్తిగత ఇన్వెస్టర్లతో పాటు గ్లోబల్‌ కంపెనీలు హైదరాబాద్‌ వైపు ఆసక్తిగా ఉన్నాయి. ఇలాంటి శుభ పరిణామంలో సిండికేట్‌ డెవలపర్లు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తున్నారు. రాష్ట్రంలో ల్యాండ్‌ టైటిల్‌ దొరుకుతుందనే విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని క్రెడాయ్‌ జాతీయ మాజీ అధ్యక్షుడు సీ శేఖర్‌ రెడ్డి తెలిపారు. లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ మార్కె ట్‌ను సృష్టిస్తేనే హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్‌ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని అభిప్రాయపడ్డారు. 2022 రియల్టీ మార్కెట్‌కు గృహ రుణ వడ్డీ రేట్లు కీలకం కానుందని.. ప్రస్తుతం ఉన్న 6.5 శాతం ఇంట్రెస్‌ రేటే కొనసాగితే ఈ ఏడాది మార్కెట్‌ను ఎవరూ ఆపలేరని వివరించారు. 


2 లక్షల యూనిట్ల వరకు అవసరం.. 
అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మీద ప్రభుత్వం దృష్టిసారించింది. ఓఆర్‌ఆర్‌తో జిల్లా కేంద్రాలకు, మెట్రో రైల్‌తో ప్రధాన నగరంలో కనెక్టివిటీ పెరిగింది. సిటీలో పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గింది. దీంతో అందుబాటు ధరలు ఉండే శివారు ప్రాంతాలలో సైతం గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆఫీస్‌లు పునఃప్రారంభం కావటంతో ఇప్పటికే ఉన్న కంపెనీలతో పాటూ కొత్తవి విస్తరణ చేపట్టాయి. దీంతో ఆఫీస్‌ స్పేస్‌ ఆక్యుపెన్సీ పెరిగింది. ఇది రానున్న రోజుల్లో గృహాల డిమాండ్‌ను ఏర్పరుస్తుందని ఎస్‌ఎంఆర్‌ బిల్డర్స్‌ సీఎండీ రాంరెడ్డి అభిప్రాయపడ్డారు. సాధారణంగా హైదరాబాద్‌లో ఏటా 30–40 వేల గృహాలు డెలివరీ అవుతుంటాయి. మరో 70–75 వేల యూనిట్లు వివిధ దశలో నిర్మాణంలో ఉంటాయి. అయితే ఈ ఏడాది అదనంగా 1.5 – 2 లక్షల యూనిట్ల అవసరం ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం నగరంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న యూనిట్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారు. దీంతో నాణ్యమైన నిర్మాణం, పెద్ద సైజు యూనిట్లకు డిమాండ్‌ ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ హైదరాబాద్‌తో పాటూ షాద్‌నగర్, శంకర్‌పల్లి, చేవెళ్ల, ఆదిభట్ల, నాగార్జున్‌ సాగర్‌ రోడ్, శ్రీశైలం జాతీయ రహదారి మార్గంలో డిమాండ్‌ కొనసాగుతుందని వివరించారు. మేడ్చల్, శామీర్‌పేట మార్గంలో ప్రక్క జిల్లాల పెట్టుబడిదారులు చేపట్టే విక్రయాలే ఉంటాయని తెలిపారు. యాదాద్రిని చూపించి వరంగల్‌ రహదారి మార్కెట్‌ను పాడుచేశారని పేర్కొన్నారు. 


సగం ధర అంటే అనుమానించండి.. 
కరోనా తర్వాత నుంచి నైపుణ్య కార్మికుల కొరత ఏర్పడింది. స్టీల్, సిమెంట్‌ వంటి నిర్మాణ సామగ్రి ధరలు, లేబర్‌ చార్జీలు రెట్టింపయ్యాయి. దీంతో నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.300–400 వరకు పెరిగింది. రెగ్యులర్‌ డెవలపరే నిర్మాణాన్ని పూర్తి చేయడమే సాహసంగా మారిన తరుణంలో.. మార్కెట్‌ రేటు కంటే 40–50 శాతం తక్కువ ధరకు విక్రయిస్తున్నారంటే ఆ డెవలపర్‌ను అనుమానించాల్సిందే. నిర్మాణ అనుమతులు లేకుండా, రెరాలో నమోదు చేయకుండానే విక్రయిస్తున్నారంటే ప్రాజెక్ట్‌ను ఎలా పూర్తి చేయగలుగుతారనేది కొనుగోలుదారులే విశ్లేషించుకోవాలి. 

అంతా హ్యాపీగా ఉండాలంటే
నిర్మాణ సంస్థలు ఒకరిని మించి మరొకరు ఆకాశహర్మ్యాలు అని ఆర్భాట ప్రచారానికి వెళ్లకూడదు. అంత ఎత్తులో ప్రాజెక్ట్‌ను చేపట్టే ఆర్థిక స్థోమత, సాంకేతికత, సామర్థ్యం ఉన్నాయా అనేది విశ్లేషించుకోవాలి. అంతే తప్ప పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు తొందరపాటు గురైతే తనతో పాటూ కొనుగోలుదారులూ నిండా మునిగిపోతారని ఆర్క్‌ గ్రూప్‌ సీఎండీ గుమ్మి రాంరెడ్డి తెలిపారు. నిర్మాణ అనుమతులు వచ్చాక ప్రాజెక్ట్‌లను లాంచింగ్, విక్రయాలు చేయాలి. దీంతో డెవలపర్, కస్టమర్, బ్యాంకర్, ప్రభుత్వం అందరూ హ్యాపీగానే ఉంటారు. బిల్డర్‌ ప్రొఫైల్‌ను పరిశీలించకుండా, తక్కువ ధరని తొందరపడి కొనొద్దు. 

ఒమిక్రాన్‌ ప్రభావం ఉంటుందా? 
కరోనా తర్వాత ఇంటి అవసరం పెరిగింది. సొంతిల్లు ఉంటే బాగుంటుందనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో చాలా మంది గృహాల కోసం ఎంక్వైరీలు చేస్తున్నారు. ఇంటి ఎంపికలోనూ మార్పులు వచ్చాయి. వర్క్‌ ఫ్రం హోమ్, హైబ్రిడ్‌ విధానం, ఆన్‌లైన్‌ క్లాస్‌ల నేపథ్యంలో ఇంట్లో ప్రత్యేకంగా గది ఉండాలని కోరుకుంటున్నారు. ప్రశాంత వాతావరణం, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రాజెక్ట్‌లు, పెద్ద సైజు గృహాలను ఎంపిక చేస్తున్నారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి వేగంగా ఉంటుందే కానీ తీవ్రత పెద్దగా ఉండదని ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం కావటంతో నమ్మకం ఏర్పడింది కాబట్టి ఒమిక్రాన్‌ ప్రభావం మానసికంగా ఉంటుందే తప్ప రియల్టీ మార్కెట్‌పై పెద్దగా భౌతిక ప్రభావం చూపించకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  

అగ్రిమెంట్లను రిజిస్ట్రేషన్‌ చేయొద్దు
100, 200 గజాలను కూడా డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్ల కింద రిజిస్ట్రేషన్‌ చేయకూడదని క్రెడాయ్‌ జాతీయ మాజీ అధ్యక్షుడు సీ శేఖర్‌ రెడ్డి సూచించారు. వేరే దేశంలోని వ్యాపారస్తులు తక్కువ ధరకు వస్తువులను మన దేశానికి ఎగుమతి చేసి విక్రయిస్తుంటే యాంటీ డంప్‌ డ్యూటీ ఎలాగైతే చెల్లిస్తారో.. అలాగే యూడీఎస్, ప్రీలాంచ్‌ డెవలపర్ల నుంచి కూడా అధిక పన్నులు వసూలు చేయాలని అభిప్రాయపడ్డారు. యూడీఎస్, ప్రీలాంచ్‌ డెవలపర్లను కూడా రెరా పరిధిలోకి తీసుకురావాలని కోరారు.

చదవండి: ఖాళీ స్థలం చూపిస్తూ యూడీఎస్‌లో విక్రయాలు

మరిన్ని వార్తలు