రియల్‌ ఎస్టేట్‌ జోరు.. 5.6 లక్షల ఇళ్ల నిర్మాణం! హైదరాబాద్‌ సహా ఏడు నగరాల్లో..

22 May, 2023 07:53 IST|Sakshi

ఈ ఏడాది 5.6 లక్షల ఇళ్ల డెలివరీ

హైదరాబాద్‌లో 23,800 యూనిట్లు

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో ఇళ్ల నిర్మాణం వేగాన్ని అందుకోనుంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది 5,57,900 ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ వెల్లడించింది. 2022లో 4,02,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని డెవలపర్లు నిర్ణయించినట్టు పేర్కొంది. అయితే, ఈ లక్ష్యాన్ని సాధించారా అన్నది తెలియజేయలేదు. నిర్మాణం పూర్తి చేసి డెలివరీ ఇవ్వాల్సిన ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు అనరాక్‌ తెలిపింది.

రియల్‌ ఎస్టేట్‌ రంగ నియంత్రణ విభాగం ‘రెరా’, నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, ఇళ్ల అమ్మకాల రూపంలో పెరిగిన నగదు ప్రవాహం, ఆర్థిక సంస్థల నుంచి నిధుల మద్దతు.. ఇవన్నీ ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేందుకు సానుకూలించే అంశాలుగా పేర్కొంది. డెవలపర్లు ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా ప్రయత్నిస్తున్నారని, ఆలస్యం కావడం వల్ల నిర్మాణ వ్యయాల భారం పెరుగుతుందని వివరించింది. ‘‘షెడ్యూల్‌ ప్రకారం 2023లో టాప్‌–7 పట్టణాల్లో 5.6 లక్షల ఇళ్లను నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారులకు స్వాధీనం చేయాల్సి (డెలివరీ) ఉంది. క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 39 శాతం అధికం’’అని అనరాక్‌ వైస్‌ చైర్మన్‌ సంతోష్‌ కుమార్‌ తెలిపారు.  

హైదరాబాద్‌లో.. 
షెడ్యూల్‌ ప్రకారం హైదరాబాద్‌ మార్కెట్లో డెవలపర్లు 23,800 ఇళ్లను ఈ ఏడాది నిర్మించి కొనుగోలుదారులకు ఇవ్వాల్సి ఉంది. క్రితం ఏడాది ఇలా షెడ్యూల్‌ ప్రకారం పూర్తి చేయాల్సి యూనిట్ల సంఖ్య 11,700గా ఉంది. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో ఎక్కువ ఇళ్లను నిర్మించి ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ ఉంది. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 1,70,100 ఇళ్లను ఈ ఏడాది డెలివరీ చేయాల్సి ఉంది. ముంబై ఎంఎంఆర్‌లో 1,31,400 యూనిట్లను పూర్తి చేసి ఇవ్వాలి.

ఇదీ చదవండి: తొందరొద్దు బాసూ.. ఆలోచించి కొను హౌసు!

మరిన్ని వార్తలు