రెండింతలు పెరిగిన ఇళ్ల విక్రయాలు

5 Oct, 2021 08:00 IST|Sakshi

అధికమైన ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు జూలై–సెప్టెంబర్‌లో 32,358 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 14,415 యూనిట్లు మాత్రమే. ప్రాపర్టీ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా ప్రకారం.. హైదరాబాద్‌ సహా ఏడు నగరాల్లో డిమాండ్‌ తిరిగి పుంజుకుంది. ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో అమ్ముడైన ఇళ్ల సంఖ్య 19,635 యూనిట్లు. 

హైదరాబాద్‌లో ఇలా
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో విక్రయాలు 2,122 నుంచి 4,418 యూనిట్లకు ఎగబాకాయి. ఇక సెప్టెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో ఏడు ప్రధాన నగరాల్లో 77,576 ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 52,619 యూనిట్లుగా ఉంది. క్యూ2తో పోలిస్తే క్యూ3లో అమ్మకం కాని ఇళ్లు స్థిరంగా 4.78 లక్షల యూనిట్ల స్థాయిలో ఉన్నాయి.

నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ప్రకారం.. 
ఎనమిది ప్రధాన నగరాల్లో గత త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు కోవిడ్‌ ముందస్తు స్థాయికి చేరాయని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా చెబుతోంది. 64,010 యూనిట్లు విక్రయం అయ్యాయని వెల్లడించింది. ధరల్లో స్థిరత్వంతోపాటు వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం ఇందుకు కారణమని తెలిపింది. క్రితం ఏడాదితో పోలిస్తే 92% వృద్ధి నమోదైంది. ఏప్రిల్‌–జూన్‌లో 27,453 యూనిట్లు అమ్ముడయ్యాయని తెలిపింది.  

ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌.. 
దేశంలో ఎనమిది ప్రధాన నగరాల్లో ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ జూలై–సెప్టెంబర్‌లో 1.25 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. గతేడాది ఇదే కాలంలో ఇది 47 లక్షల చదరపు అడుగులు ఉంది. ప్రధానంగా ఐటీ రంగం కారణంగా ఈ స్థాయి డిమాండ్‌ వచ్చిందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది.

చదవండి :టాప్‌గేర్‌లో హైదరాబాద్‌

మరిన్ని వార్తలు