రికవరీ ఆశలు- రియల్టీ షేర్లు గెలాప్‌

19 Nov, 2020 12:25 IST|Sakshi

చౌక వడ్డీ రేట్లు, కేంద్ర పథకాల ఎఫెక్ట్‌

రెసిడెన్షియల్‌ విభాగం విక్రయాలపై ఆశలు

కంపెనీల ఫలితాలపై పెరుగుతున్న అంచనాలు

ముంబై, సాక్షి: ఒడిదొడుకుల మార్కెట్లోనూ రయల్టీ రంగ కౌంటర్లకు డిమాండ్‌ నెలకొంది. దీంతో తొలుత ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగం 3 శాతం ఎగసింది. పలు కౌంటర్లకు డిమాండ్‌ ఏర్పడటంతో లాభాలతో పరుగు తీస్తున్నాయి. ఇందుకు పలు అంశాలు దోహదం చేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు చూద్దాం..

షేర్ల జోరు
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ప్రెస్టేజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్‌ దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 285 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 289 వరకూ ఎగసింది. ఈ బాటలో గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ దాదాపు 4 శాతం పెరిగి రూ. 1,105 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1,122 వరకూ లాభపడింది. డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ సైతం 3 శాతం వృద్ధితో రూ. 196 వద్ద కదులుతోంది. తొలుత రూ. 201 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. ఇతర కౌంటర్లలో ఇండియాబుల్స్‌ రియల్టీ 2.7 శాతం బలపడి రూ. 63 వద్ద ట్రేడవుతోంది. శోభా లిమిటెడ్‌ 1.25 శాతం పుంజుకుని రూ. 318 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 323 వరకూ పురోగమించింది. ఇదే విధంగా ఒబెరాయ్‌, సన్‌టెక్‌, బ్రిగేట్‌ సైతం 0.5 శాతం స్థాయిలో బలపడి ట్రేడవుతున్నాయి.

కారణాలివీ..
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో రియల్టీ రంగ కంపెనీలు సగటున ప్రోత్సాహకర ఫలితాలు సాధించినట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రధానంగా క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో రెసిడెన్షియల్‌ విభాగం పటిష్ట పనితీరును చూపినట్లు తెలియజేశారు. తద్వారా నిర్వహణ లాభాలను సాధించినట్లు వివరించారు. ఇటీవల కనిపిస్తున్న ఆర్థిక రికవరీ రియల్టీకి డిమాండ్‌ను పెంచనున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. రిటైల్‌, ఆతిథ్య రంగం నుంచి డిమాండ్‌ పెరిగే వీలున్నట్లు పేర్కొన్నాయి. దీనికితోడు ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రెసిడెన్షియల్‌ విభాగానికి పన్నుసంబంధ మినహాయింపులను ప్రకటించడంతో సెంటిమెంటు బలపడినట్లు తెలియజేశాయి. అంతేకాకుండా పీఎంఏవై పథకానికి అదనంగా రూ. 18,000 కోట్లు కేటాయించడం కూడా ఇందుకు దోహదపడనున్నట్లు విశ్లేషించాయి.

మరిన్ని వార్తలు