పసిడికి ‘వడ్డీరేట్ల’ గుబులు!

18 Jun, 2021 08:19 IST|Sakshi

అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ 

మార్కెట్‌లో 100 డాలర్ల పతనం

అనుసరించిన ఎంసీఎక్స్‌

న్యూఢిల్లీ: అమెరికాలో వడ్డీరేట్లు పెరగవచ్చన్న అంచనాలు అంతర్జాతీయంగా అటు డాలర్‌ ఇండెక్స్‌ బలపడ్డానికి – పసిడి పతనానికి దారితీశాయి. ఈ వార్త రాసే రాత్రి 9.30 గంటల సమయంలో అంతర్జాతీయం ఫ్యూచర్స్‌ మార్కెట్‌– న్యూయార్క్‌ కమోడిటీ ఎక్సేంజ్‌లో  పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర క్రితం ముగింపుతో పోల్చితే దాదాపు 100 డాలర్లు పతనమై, 1770 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మే తర్వాత ఇంత తక్కువ స్థాయి ఇదే తొలిసారి. కాగా, ఫెడ్‌ సమావేశ నిర్ణయాల అనంతరం ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్‌ ఫ్రాంక్, జపనీస్‌ యన్, కెనడియన్‌ డాలర్, బ్రిటన్‌ పౌండ్, స్వీడిష్‌ క్రోనా)  ప్రాతిపదికన లెక్కించే డాలర్‌ ఇండెక్స్‌ దాదాపు 92 స్థాయికి చేరింది. అమెరికాలో ద్రవ్యోల్బణం భయాలు, దీనితో ఊహించినదానికన్నా ముందుగానే వడ్డీరేట్లు పెరగవచ్చన్న అమెరికన్‌  ఫెడరల్‌ బ్యాంక్‌ చీఫ్‌ పావెల్‌ సూచనలు దీనికి నేపథ్యం. రెండు రోజుల సెంట్రల్‌ బ్యాంక్‌ విధాన సమీక్ష అనంతరం పావెల్‌ ఒక ప్రకటన చేస్తూ, ‘ఈ ఏడాది అధిక ద్రవ్యోల్బణం తాత్కాలిక పరిణామంగా ఉండవచ్చు. అయితే తద్వారా వచ్చే ఇబ్బందుల గురించి పట్టించుకోకుండా ఉండలేం’ అని వ్యాఖ్యానించారు. రేటు నిర్ణయ కమిటీలోని కొందరు సభ్యులు ఊహించినదానికన్నా ముందుగానే వడ్డీరేట్లు పెంచవచ్చన్న అంచనాలను వెలిబుచ్చినట్లు సూచించడంతో ఈ ప్రభావం అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లతోపాటు పసిడిపై సైతం ప్రభావం చూపింది. 
 
దేశీయంగా రూ.1,700 పతనం 

అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌ లో 10 గ్రాముల ధర రూ.1,700 పతనమై రూ.46,864కు పడిపోయింది. కాగా ముంబై స్పాట్‌ మార్కెట్‌లో గురువారం బంగారం 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత 10గ్రాముల ధరలు వరుసగా రూ.841, రూ.837 తగ్గి రూ.47,556, రూ.47,366 వద్ద ముగిశాయి. ఇక వెండి ధర కేజీ ధర రూ.1,873 తగ్గి రూ.69,520కి పడింది.

చదవండిఇకపై బంగారం కొనాలంటే ఇది తప్పనిసరి

>
మరిన్ని వార్తలు