బీఎస్‌ఎన్‌ఎల్‌ పతనం ఇలా.....

19 Nov, 2020 15:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ముంబై వాసి అమిష్‌ గుప్తా 2005లో ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ కనెక్షన్‌ పెట్టించుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం అది పని చేయడం మానేసింది. ఆయన దాన్ని పట్టించుకోకుండా తన మొబైల్‌ ఫోన్‌ మాత్రమే ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. హఠాత్తుగా గత మే నెలలో మళ్లీ ఆయన ఇంట్లోని ల్యాండ్‌లైన్‌ పని చేయడం ప్రారంభించింది. ఈ విషయమై ల్యాండ్‌లైన్‌ టెలికాం సర్వీసు ప్రొఫైడర్‌ అయిన మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎంటీఎన్‌ఎల్‌)కు ఫిర్యాదు చేయాలని అమిష్‌ గుప్తా నిర్ణయించుకున్నారు. 

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)కు ఎంటీఎన్‌ఎల్‌ అనుబంధ సంస్థ. ఇది ఢిల్లీ, ముంబై నగరాల్లో టెలికమ్‌ సర్వీసులను నిర్వహిస్తోంది. ఎలాగు ఫోన్‌ పని చేస్తోందిగదా! అని గుప్తా ఎంటీఎన్‌ఎల్‌ అధికారులకు పది, పదిహేనుసార్లు ఫోన్లు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయనే ఓ రోజు వడాలాలోని ఎంటీఎన్‌ఎల్‌ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ రెండు, మూడు కుర్చీలు, టేబుళ్లు తప్పా అన్ని కుర్చీలు, టేబుళ్లు ఖాళీగా ఉన్నాయి. ఆ రెండు, మూడు టేబుళ్ల చుట్టే ఐదారు సార్లు తిరగాల్సి వచ్చింది. అప్పటికి సరైన సమాధానం లేకపోవడంతో జూలై నెలలో ఆయన తన ల్యాండ్‌లైన్‌ సర్వీసును రద్దు చేసుకోవాలనుకున్నారు. 

‘ల్యాండ్‌లైన్‌ను సరండర్‌ చేయడానికి నాకు మరో రెండు నెలలు పట్టింది. నేను సహజంగా ఎంటీఎన్‌ఎల్‌ లాంటి ప్రభుత్వ సంస్థలను అభిమానిస్తాను. ఎందుకంటే నేను అంభాని అభిమానిని కాదు. ఇంటి నుంచి పనిచేయాల్సిన కరోనా గడ్డుకాలంలో పటిష్టమైన ఇంటర్నెట్‌ అవసరం కనుక తప్పనిసరి పరిస్థితుల్లో ఎంటీఎన్‌ఎల్‌ సర్వీసును రద్దు చేసుకొని ఆ స్థానంలో జియో ల్యాండ్‌లైన్, బ్రాండ్‌ బ్యాండ్‌ తీసుకోవాల్సి వచ్చింది’ అంటూ గుప్తా వాపోయారు. రిలయెన్స్‌ జియో ఇన్‌ఫోకామ్‌ ఆసియాలోనే అత్యంత కుబేరుడైన ముకేష్‌ అంబానీదని తెల్సిందే. ఆ కంపెనీ 2016లో 4జీ సర్వీసులను అత్యంత చౌకగా అందిస్తూ మార్కెట్‌లోకి ప్రవేశించింది. 

‘టెలికం రంగంలో ప్రైవేటు కార్పొరేట్‌ కంపెనీలను ప్రోత్సహించడం కోసమే బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ సంస్థలను ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం నీరుగారుస్తూ వచ్చాయి’ ఎంటీఎన్‌ఎల్‌ మాజీ డిప్యూటి మేనేజర్‌ సూర్యకాంత్‌ ముద్రాస్‌ వ్యాఖ్యానించారు. 2010లో ముంబై, ఢిల్లీ నగరాల్లో 60 లక్షల ల్యాండ్‌లైన్‌ వినియోగదారులు ఉండగా, వారి సంఖ్య ప్రస్తుతం 27 లక్షలకు పడి పోయింది. ఇక దేశవ్యాప్తంగా 2016 నాటికి 2.4 కోట్ల మంది ల్యాండ్‌లైన్‌ వినియోగదారులుండగా, వారి సంఖ్య 2020, జూలై నాటికి 1.9 కోట్లకు పడిపోయింది. ఒక్క మొబైల్‌ ఫోన్ల వాడకం పెరగడమే దీనికి కారణం కాదని, బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ సర్వీసులు మరీ అధ్వాన్నంగా ఉండడమే కారణమని పలువురు వాటి మాజీ వినియోగదారులు తెలియజేశారు. ఫోన్‌ పనిచేయడం లేదంటూ ఎన్ని సార్లు ఫిర్యాదు చే సినా వచ్చి చూసేందుకు సిబ్బంది లేరంటూ నెలల తరబడి రాకపోవడంతో 2009లో బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ను సరెండ్‌ చేయక తప్పలేదని హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన టీచర్‌ మంజులా గోస్వామి తెలిపారు. 2000 సంవత్సరం నుంచే బీఎస్‌ఎన్‌ఎల్‌లో సిబ్బంది తగ్గుతూ వచ్చింది. 

సాధారణంగా ప్రతి 500 ల్యాండ్‌లైన్‌ ఫోన్లకు ఒక టెక్నీషియన్‌ అవసరమని, అయితే ప్రస్తుతం రెండువేల ఫోన్లకు ఒక టెక్నీషియన్‌ చొప్పున ఉన్నారని ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ టెలికామ్‌ ఆపరేటర్స్‌ యూనియన్‌’ అధ్యక్షుడు థామస్‌ జాన్‌ తెలిపారు. గతేడాది కేంద్ర ప్రభుత్వ టెలి కమ్యూనికేషన్ల విభాగం ‘స్వచ్ఛంద పదవీ విరమణ పథకం’ ప్రవేశపెట్టినప్పటి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ సంస్థల్లో సిబ్బంది బాగా తగ్గిపోయారు. ఈ వాస్తవానికి ఈ రెండు సంస్థల పునరుద్ధరకు కేంద్ర ప్రభుత్వం 70 వేల రూపాయల నిధులను ప్రకటించగా, అందులో 30 వేల కోట్ల రూపాయలను పదవీ విరమణ పథకానికే కేటాయించడం గమనార్హం. పథకాన్ని అమలు చేసిన తొలి రోజే ఈ రెండు ప్రభుత్వ టెలికమ్‌ సంస్థల నుంచి 92,300 మంది పదవీ విరమణ పొందారు. ఆ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా టెలికం సిబ్బంది ఆందోళన చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. 2019 నాటికి బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలు 13,804 కోట్ల రూపాయలుకాగా ఎంటీఎన్‌ఎల్‌ నష్టాలు 3,693 కోట్ల రూపాయలు.

సిబ్బంది కొరత కారణంగానే ప్రభుత్వ టెలికమ్‌ సంస్థలు దెబ్బతినలేదని, ల్యాండ్‌లైన్లకు ఉపయోగించిన కాపర్‌లైన్లను మార్చి కొత్తగా ఫైబర్‌ కేబుళ్లు వేయాల్సి ఉండగా, అందుకు బడ్జెట్‌ను కేటాయించలేదని ఎంటీఎన్‌ఎల్‌ సెక్షన్‌ సూపర్‌వైజర్‌ షర్కీ తెలిపారు. ప్రైవేటు టెలికమ్‌ సంస్థలను ప్రోత్సహించడంలో భాగంగానే ప్రభుత్వ సంస్థలకు బడ్జెట్‌ కేటాయింపులు జరపలేదని పేర్లు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఎంటీఎన్‌ఎల్‌ అధికారులు మీడియాకు తెలిపారు. 2016లో రిలయెన్స్‌ జియో సహా అన్ని ప్రైవేటు టెలికమ్‌ కంపెనీలు 4 జీ సర్వీసులను ప్రవేశపెట్టగా, ప్రభుత్వ సంస్థలు 3 జీ టెక్నాలజీకే పరిమితం అవడం కూడా వాటి పతనానికి దారితీసిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ‘బీఎస్‌ఎన్‌ఎల్‌–ఎంటీఎన్‌ఎల్‌ సంస్థలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం వాటి ప్రయోజనాలకు వ్యతిరేకమైనదే. వాటిని చంపేయాలనే ఉద్దేశంతోనే వారు అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు’ అని ఎంటీఎన్‌ఎల్‌ కామ్‌గర్‌ సంఘ్‌ అధినేత, శివసేన పార్లమెంట్‌ సభ్యులు అర్వింద్‌ సామంత్‌ ఆరోపించారు.

మరిన్ని వార్తలు