Diwali Gifts: గిఫ్ట్స్, బోనస్‌లు అందుకున్నారా? మరి ట్యాక్స్ ఎంతో తెలుసా? 

18 Oct, 2022 12:52 IST|Sakshi

సాక్షి,ముంబై: దీపావళి పర్వదినం సందర్భంగా ఎవరినుంచైనా గిఫ్ట్స్ తీసుకున్నారా? లేదంటే మీరు పని చేస్తున్న కంపెనీ నుంచి బోనస్  స్వీకరించారా?  అయితే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. బహుమతులు వాటి స్వభావాన్ని బట్టి ఈ పన్ను వివిధ వర్గాలుగా వర్గీకరించారు. ఈ నేపథ్యంలో పండుగ బహుమతులు, బోనస్‌పై ఎంత ట్యాక్స్ చెల్లించాలో ఒక సారి చూద్దాం. 

పండుగ సీజన్‌ వచ్చిందంటే గిఫ్ట్స్‌, సాలరీ బోనస్ ఇవన్నీ  సర్వ సాధారణం. ఉద్యోగులందుకునే బోనస్‌ను కూడా వేతనంగా భావించే ఆదాయ పన్ను శాఖ  వాటిపై  పన్ను విధిస్తుంది. వేతనాల ఆధారంగా చెల్లించే బోనస్‌కు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, కొన్ని బహుమతుల విలువను బట్టి , ఎవరి నుండి స్వీకరించారో బట్టి వాటిపై పన్ను విధించే అవకాశం ఉంది. ఈ  బహుమతి మినహాయించిన కేటగిరీ కిందకు రాకపోతే, ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్‌) ఫైల్ చేసేటప్పుడు దానిని  కచ్చితంగా బహిర్గతం చేయాల్సి ఉంటుంది.  శ్లాబ్ రేటును బట్టి   సంబంధిత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలా వార్షిక వేతనంతో బోనస్ కూడా కలిపి మొత్తం ఆదాయంపై పన్ను చెల్లించాలి.

► ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో స్వీకరించే బహుమతుల మొత్తం విలువ రూ. 50,000 కంటే ఎక్కువగా ఉంటే, అది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2) ప్రకారం పన్ను   వడ్డింపు  ఉంటుంది. 

►  ఈ బహుమతులు నగదు లేదా రకమైన రూపంలో ఉండవచ్చు. అయితే, దగ్గరి బంధువులు లేదా కుటుంబ సభ్యులు ఇచ్చే బహుమతులకు పన్ను మినహాయింపు ఇచ్చారు. అంటే సోదరుడు, సోదరి, తల్లిదండ్రులు జీవిత భాగస్వామి ఇచ్చే బహుమతులపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.

► భూమి లేదా భవనం రూపంలో బహుమతులు వచ్చినట్లయితే, వాటిని స్థిరమైన ఆస్తిగా పరిగణిస్తారు. ఒకవేళ ఈ ఆస్తి స్టాంప్ డ్యూటీ విలువ 50వేల రూపాయలు  దాటితే బహుమతిపై పన్ను విధించబడుతుంది.

► అదే సమయంలో గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్స్, ఆభరణాలు, పెయింటింగ్‌లు, డ్రాయింగ్‌లు, షేర్‌లు/సెక్యూరిటీలు వంటి బహుమతులు, ఇతర వాటితో పాటుగా, చరాస్తుల మార్కెట్ విలువ రూ. 50వేల కంటే ఎక్కువ ఉంటే పన్ను చెల్లించాల్సిందే. 

మరిన్ని వార్తలు