ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్‌ఫర్‌..! కానీ..

4 Dec, 2023 13:03 IST|Sakshi

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ చిన్న సందేహం వచ్చినా తెలుకునేందుకు ఇంటర్నెట్‌లో వెతుకుతుంటాం. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిపోయింది. అందుకే వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. తాజాగా జపాన్‌కు చెందిన పరిశోధకుల బృందం ప్రపంచంలోనే అధిక ట్రాఫిక్‌ కలిగిన ఇంటర్నెట్‌ను సరఫరాచేసి రికార్డు నెలకొల్పారు. ఆప్టికల్‌ఫైబర్‌ ద్వారా సెకనుకు 22.9 పెటాబిట్‌ల డేటాను సరఫరాచేసి రికార్డు సృష్టించారు. అక్టోబర్‌లో స్కాట్‌లాండ్‌లో జరిగిన యూరోపియన్ కాన్ఫరెన్స్ ఆన్ ఆప్టికల్ కమ్యూనికేషన్‌లో ఈ పరిశోధన నివేదికను సమర్పించారు.

జపాన్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఎన్‌ఐసీటీ) సెకనుకు 22.9 పెటాబిట్‌ల(1 పెటాబిట్ అంటే 10 లక్షల గిగాబిట్‌లకు సమానం) డేటా ట్రాన్స్‌మిషన్ రేటును అధిగమించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక్‌ కలిగిన డేటాను ఇంటర్నెట్‌ ద్వారా సరఫరా చేశారు. దీంతో ఇంటర్నెట్‌లోని మొత్తం ట్రాఫిక్‌ను సెకండ్ బై సెకండ్ 22 సార్లు ప్రసారం చేయవచ్చు. నాసా కూడా కూడా సెకనుకు 46 టెరాబిట్‌ల డేటాను మాత్రమే ట్రాన్స్‌ఫర్‌ చేస్తోంది.

ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా  దాదాపు సెకనుకు 10 గిగాబిట్‌ డేటాను ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉంది. కానీ చాలావరకు సెకనుకు వందల మెగాబిట్‌ డేటాను మాత్రమే సరఫరా అవుతోంది. అయితే తాజాగా ఎన్‌ఐసీటీ సెకనుకు 22.9 పెటాబిట్‌ డేటా ట్రాన్స్‌ఫర్‌ స్పీడ్‌ను సాధించడానికి కొన్ని అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించింది. డేటాను ప్రసారం చేయడానికి ఒక కోర్‌ ఛానల్‌కు బదులుగా, 38 ఫైబర్‌కేబుళ్లను వినియోగించింది. వీటిలో ఒక్కోటి 3 మోడ్‌ల చొప్పున మొత్తం 114 ఛానెల్‌ల ద్వారా డేటాను ప్రసారం చేశారు. ప్రతి ఛానెల్‌లోని ప్రతి మోడ్ ద్వారా 750 వేవ్‌లెంత్‌, 18.8 టెరాహెడ్జెస్‌ బ్యాండ్‌విడ్త్‌తో ఈ డేటాను పంపించినట్లు తెలిసింది. అయితే కనెక్షన్‌లోని కొన్ని లోపాలు సవరించి ఆప్టిమైజ్ చేయడం వల్ల దాని ప్రస్తుత వేగం సెకనుకు 24.7 పెటాబిట్‌కు చేరుకోగలదని బృంద సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి: జాతీయ రికార్డు సృష్టించిన అదానీ కంపెనీ

అయితే, ఇకపై మనకు కావాల్సిన ఎంత డేటా అయినా సెకనులో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అనుకుంటున్నారేమో. ఈ డేటాను డీకోడ్‌ చేయడానికి సంక్లిష్టమైన సిగ్నల్ ప్రాసెసింగ్ ఉంటుందని చెప్పింది. దీనికి ఎంఐఎంఓ రిసీవర్లు అని పిలువబడే ప్రత్యేక పరికరాలు నెట్‌వర్క్‌లో ఇన్‌స్టాల్ చేయాలని వివరించింది. ప్రస్తుతం 4 కోర్‌ వర్షన్‌ ద్వారా ఒక్కోమోడ్‌ విధానంలో సెకనుకు 1 పెటాబిట్‌ డేటా ట్రాన్స్‌ఫర్‌ చేసే అవకాశం ఉందని తెలిపింది.

>
మరిన్ని వార్తలు