రికార్డు స్మార్ట్‌ఫోన్లు విక్రయం : టాప్‌లో షావోమి

28 Jan, 2021 11:12 IST|Sakshi

కస్టమర్ల చేతుల్లోకి 15 కోట్ల స్మార్ట్‌ఫోన్లు 

గతేడాది అమ్ముడైన సంఖ్య ఇది 

కోవిడ్‌ ఉన్నప్పటికీ మార్కెట్‌ జోరు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా గత సంవత్సరం 15 కోట్ల యూనిట్ల స్మార్ట్‌ఫోన్స్‌ అమ్ముడయ్యాయి. 2019తో పోలిస్తే ఇది 4 శాతం తక్కువ అని పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్‌ వెల్లడించింది. కోవిడ్‌-19 విస్తృతి నేపథ్యంలో గతేడాది ఈ స్థాయిలో అమ్మకాలు నమోదు కావడం విశేషం. లాక్‌డౌన్‌ తదనంతరం అధిక డిమాండ్‌ పెరగడం, ఇంటి నుంచి పని, ఆన్‌లైన్‌ క్లాసులు.. వెరసిఈ స్థాయి అమ్మకాలు సాధ్యమయ్యాయి. అయితే 2020 అక్టోబరు–డిసెంబరు కాలంలో స్మార్ట్‌ఫోన్స్‌ విక్రయాలు అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 19 శాతం అధికంగా జరగడం ఇక్కడ గమనార్హం. అయితే స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్‌ ఫోన్లతో కలిపి మొత్తం మొబైల్స్‌ మార్కెట్‌ గతేడాది 9 శాతం తగ్గింది. 2019తో పోలిస్తే గత సంవత్సరంలో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు 2 శాతం తగ్గి 14.5 కోట్ల యూనిట్లు నమోదయ్యాయని మరో పరిశోధన సంస్థ కెనాలిస్‌ వెల్లడించింది. 

తొలి స్థానంలో షావొమీ.. 
స్మార్ట్‌ఫోన్స్‌ సేల్స్‌లో షావొమీ దేశంలో తొలి స్థానంలో కొనసాగుతోంది. 2020తోపాటు నాల్గవ త్రైమాసికంలోనూ 26 శాతం మార్కెట్‌ వాటాను ఈ కంపెనీ సొంతం చేసుకుంది. గతేడాది అక్టోబరు–డిసెంబరు కాలంలో 21 శాతం వాటాతో సామ్‌సంగ్‌ రెండవ స్థానాన్ని ఆక్రమించింది. వివో-16 శాతం, రియల్‌మీ-13, ఒప్పో 10శాతం వాటా దక్కించు కున్నాయి. 2020లో ఇదే స్థాయిలో మార్కెట్‌ వాటాను వివో, రియల్‌మీ, ఒప్పో చేజిక్కించుకోగా, సామ్‌సంగ్‌ 20 శాతానికి పరిమితమైంది. డిసెంబరు క్వార్టర్‌లో వన్‌ప్లస్‌ 200 శాతం వృద్ధి సాధించింది. నార్డ్‌ సిరీస్, 8టీ సిరీస్‌ ఇందుకు దోహదం చేశాయి. ట్రాన్సన్‌ గ్రూప్‌ బ్రాండ్స్‌ అయిన ఐటెల్, ఇన్‌ఫినిక్స్, టెక్నో ఇప్పటి వరకు అత్యధికంగా 90 లక్షల యూనిట్లను నాల్గవ త్రైమాసికంలో విక్రయించాయి. 

కొత్త రికార్డులతో యాపిల్‌.. 
ఆరవ స్థానంలో ఉన్న యాపిల్‌ అంత క్రితం ఏడాదితో పోలిస్తే నాల్గవ త్రైమాసికంలో 171 శాతం, 2020లో 93 శాతం వృద్ధి సాధించింది. ఐఫోన్‌ 12 అందుబాటులోకి రావడం, ఐఫోన్‌ ఎస్‌ఈ 2020, ఐఫోన్‌ 11లపై ఆఫర్లకుతోడు ఆన్‌లైన్‌ విస్తరణ కారణంగా ఈ స్థాయి పనితీరు కనబరిచింది. డిసెంబరు త్రైమాసికంలో 15 లక్షల యూనిట్లను యాపిల్‌ విక్రయించింది. ఇంత మొత్తంలో ఒక త్రైమాసికంలో అమ్మకాలు సాధించడం యాపిల్‌కు ఇదే తొలిసారి.  
ఫీచర్‌ ఫోన్ల నుంచి.. 
మూడవ త్రైమాసికంలో రికార్డు స్థాయి అమ్మకాలు నమోదైన తర్వాత అదే ఊపును డిసెంబరు క్వార్టర్‌లోనూ మార్కెట్‌ కొనసాగించిందని కౌంటర్‌పాయింట్‌ రిసర్చ్‌ సీనియర్‌ అనలిస్ట్‌ ప్రచిర్‌ సింగ్‌ తెలిపారు. పండుగల సీజన్‌లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. బేసిక్‌ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్ల వైపు కస్టమర్లు మళ్లుతున్నారు. ఫీచర్‌ ఫోన్ల విక్రయాలు 2020లో 20 శాతం తగ్గాయి. ఆధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్లు అందుబాటు ధరలో లభిస్తున్నాయి. కోవిడ్‌–19 ఉన్నప్పటికీ 15 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడవడం రికార్డుగానే భావించాలని టెక్నోవిజన్‌ ఎండీ సికందర్‌ అన్నారు. ప్రధానంగా ఆన్‌లైన్‌ క్లాసులు పరిశ్రమను నడిపించాయని చెప్పారు. అయితే 2021లో భారతీయ బ్రాండ్లకు కలిసి వస్తుందని కౌంటర్‌పాయింట్‌ చెబుతోంది.

కొత్త టెక్నాలజీకి సై.. 
గతేడాది దేశవ్యాప్తంగా 5జీ స్మార్ట్‌ఫోన్లు 40 లక్షల యూనిట్లు దాటాయి. వన్‌ప్లస్, యాపిల్‌ బ్రాండ్లు ఈ విభాగాన్ని నడిపించాయి. వన్‌ప్లస్‌ మోడల్స్‌ అన్నీ 5జీ టెక్నాలజీతోనే వస్తున్నాయి. 2021లో 3.8 కోట్ల 5జీ మోడల్స్‌ అమ్ముడవుతాయని కౌంటర్‌పాయింట్‌ అంచనా వేస్తోంది. కాగా, చైనా బ్రాండ్ల వాటా దేశంలో 75 శాతానికి చేరింది. సామ్‌సంగ్, వివో, ఒప్పో బ్రాండ్లు ఆన్‌లైన్‌ మార్కెట్‌పై పెద్ద ఎత్తున ఫోకస్‌ చేశాయి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను అందుకోవడం ద్వారా దేశీయ బ్రాండ్లు తమ వాటాను పెంచుకోవాలని చూస్తున్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు