RedLine Malware: ల్యాప్‌టాప్, పీసీలలో ఇలా చేస్తున్నారా? ఇక మీ పని అయిపోయినట్టే..

2 Jan, 2022 16:29 IST|Sakshi

మీరు మీ సొంత/కంపెనీ ల్యాప్‌టాప్, పీసీలోని గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లలో ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను సేవ్ చేస్తున్నారా? అయితే, ఇక మీ పని అయిపోయినట్టే. హ్యాకర్లు మీ ల్యాప్‌టాప్, పీసీలోని పాస్‌వర్డ్‌లను రెడ్ లైన్ మాల్ వేర్ సహాయంతో హ్యాక్ చేసే అవకాశం ఎక్కువ ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఇటీవల కాలంలో ఇంటి నుంచి పనిచేసే వారి శాతం రోజు రోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. వారు తమ కార్యాలయ పనులతో పాటు ముఖ్యమైన పనులకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను ల్యాప్‌టాప్, పీసీలోని గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లలో సేవ్ చేసుకుంటున్నారు. 

అయితే, ఇలా చేయడం వల్ల భారీ ముప్పు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఆహ్న్ ల్యాబ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మధ్యకాలంలో ఒక కంపెనీకి చెందిన ఉద్యోగి ఇంటి నుంచి పనిచేస్తున్న సమయంలో ఇతర ఉద్యోగులు వాడే ల్యాప్‌టాప్‌లో పనిచేసేవారు. అయితే, ఆ ల్యాప్‌టాప్‌లో సమాచారాన్ని దొంగిలించే రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ ఉందనె విషయం అతనికి తెలియదు. ఈ విషయం తెలియక ఆ ఉద్యోగి తను వాడుతున్న ల్యాప్‌టాప్‌లో గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లో ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను సేవ్ చేశాడు. అప్పటికే ల్యాప్‌టాప్‌లో ఉన్న రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ ఆ సమాచారాన్ని మొత్తం హ్యాకర్ల చేతికి ఇచ్చింది. 

అయితే, మరో కీలక విషయం ఏమిటంటే. ఈ రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ చాలా తక్కువ ధరకు లభిస్తున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ డార్క్ వెబ్ సైట్లలో దీనిని $150కు కొనుగోలు చేయవచ్చు. అంటే, ఎవరైనా, మీ ల్యాప్‌టాప్, పీసీలలో ఈ స్పై సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే ఇక మీ పని అంతే అని నిపుణులు అంటున్నారు. అందుకే, మీ సొంత ల్యాప్‌టాప్, పీసీలతో కంపెనీ ఇచ్చే వాటిలో పాస్‌వర్డ్‌లను సేవ్ చేసుకోకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఈ రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ మొదట మార్చి 2020లో రష్యన్ డార్క్ వెబ్లో కనిపించింది. ఇలాంటి మాల్ వేర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

(చదవండి: 50 బిలియన్‌ డాలర్ల లక్ష్యం..! యాపిల్‌..మేక్‌ ఇన్‌ ఇండియా..!)

మరిన్ని వార్తలు