భారత్‌కు మధ్యంతర నిర్మాణాత్మక సమస్యల్లో అవి కూడా: ఐఎంఎఫ్‌

23 Apr, 2022 21:15 IST|Sakshi

ఐఎంఎఫ్‌ స్పష్టీకరణ

సమీపకాలంలో క్రిప్టోప్రాధాన్యతాంశమని విశ్లేషణ

ఇదే జాబితాలో డిజిటల్‌ కరెన్సీ

వాషింగ్టన్‌: డిజిటల్‌ కరెన్సీతో పాటు క్రిప్టో ఆస్తులను నియంత్రించడం భారతదేశానికి మధ్యంతర నిర్మాణాత్మక సమస్యలలో కొన్నని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఫైనాన్షియల్‌ కౌన్సెలర్,  మానిటరీ క్యాపిటల్‌ మార్కెట్స్‌ విభాగం డైరెక్టర్‌ టోబియాస్‌ అడ్రియన్‌ పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ రంగంలో మిగిలిన నియంత్రణ సమస్యలను పరిష్కరించడం,  గ్లోబల్‌ ఎకానమీతో ఏకీకృతం చేయడం వంటి సమస్యలూ జాబితాలో ఉన్నాయని ఆయన విశ్లేషించారు. అయితే  భారతదేశాన్ని ఐఎంఎఫ్‌ ‘‘చాలా సానుకూల ధోరణి’’తో  చూస్తోందని వెల్లడించారు. వృద్ధి పునరుద్ధరణకు తగిన అవకాశాలను భారత్‌లో ఉన్నాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కొత్త వృద్ధి అవకాశాలు, పరిణామాలను సానుకూలంగా తీసుకోవడానికి భారత్‌  చాలా ఉత్సాహం ఉందని అన్నారు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్‌ వార్షిక స్పింగ్‌ సమావేశాల సందర్భంగా చేసిన ప్రసంగంలో అడ్రియన్‌ ఈ ప్రకటన చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... 

► మేము ఎల్లప్పుడూ వృద్ధి విస్తృత ప్రాతిపదికన అన్ని వర్గాలకు అందాలని కోరుకుంటాము.  ఈ విషయంలో భారత్‌కు సంబంధించి మా దృక్పథం చాలా సానుకూలంగా ఉంది. 
►  క్రిప్టో కరెన్సీ నియంత్రణ కసరత్తు ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఆర్థిక స్థిరత్వం కోణంలో తాము  క్రిప్టో నిబంధనల కోసం ప్రపంచ ప్రమాణాలతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నాం. భారత్‌ కూడా ఈ దిశలో ప్రయత్నం చేయాలని  కోరుకుంటున్నాము.  
►   క్రిప్టోలకు సంబంధించి భారతదేశం పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడం స్వాగతనీయం. 
►  భారత్‌కు సంబంధించి రెండవ కీలక అంశం ఏమిటంటే, డిజిటల్‌ కరెన్సీ. అన్ని వర్గాలకూ వృద్ధి ఫలాలు అందడం, ఆర్థిక అభివృద్ధికి ఇది చాలా ముఖ్యమైనది.  ఈ అంశానికి సంబంధించి భారత్‌ ఏమి చేస్తుందన్న అంశాన్ని చాలా నిశితంగా గమనిస్తున్నాము. ఈ విషయంలో భారత్‌ విధానపరమైన నిర్ణయాలను మేము స్వాగతిస్తున్నాము. 
►  ఫైనాన్షియల్‌ మార్కెట్లు, సంస్థలు అభివృద్ధికి కీలకం. బ్యాంకింగ్, నాన్‌–బ్యాంకింగ్‌ వ్యవస్థలో మిగిలిన నియంత్రణ సమస్యలను పరిష్కరించడం కూడా చాలా ముఖ్యం.  
►   ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో, వాణిజ్యంలో భాగం కావడం భారతదేశానికి చాలా ప్రయోజనకరమని నేను భావిస్తాను. భారతదేశం అనేక ఉత్పత్తులను ఎగుమతి చేయగలదు. ఉత్పత్తులను దిగుమతీ చేసుకోగలదు. అంతర్జాతీయంగా మూలధనాన్ని సమీకరించగలదు. అంతర్జాతీయంగా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చగలదు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ పెట్టుబడులు ఉన్నాయి.  
►    మా అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా, ఆర్థిక సంబంధాల ఏకీకరణ చాలా ప్రయోజనకరంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఏకీకృత ఆర్థిక విధానం, సంబంధాలు ఇటీవలి దశాబ్దాలలో లక్షలాది మంది ప్రజలను పేదరికం నుండి బయటపడేశాయి.  కాబట్టి, మేము దీనిని ఎంతో స్వాగతిస్తున్నాము. భారతదేశం ఈ దిశలో కొనసాగడం ముఖ్యమని మేము భావిస్తున్నాము.

సావరిన్‌ రుణ భారంపై ఆందోళన అక్కర్లేదు...
సావరిన్‌ రుణాలపై ఐఎంఎఫ్‌ అధికారి టోబియాస్‌ అడ్రియన్‌ మాట్లాడుతూ  మహమ్మారి పరిస్థితుల్లో అవలంభించిన ఉద్దీపన కార్యక్రమాల వల్ల భారత్‌కు సావరిన్‌ రుణ భారాలు పెరుగుతున్న విషయాన్ని తాము గమనిస్తున్నామన్నారు. సార్వభౌమ రుణానికి సంబంధించి బ్యాంకుల హోల్డింగ్‌ల పెరుగుదలను కూడా గమనిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ, భారతదేశంలో ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా, తమ అధ్యయనం  ప్రకారం, బ్యాంకులపై సార్వభౌమ రుణాల స్థాయి కూడా  తగిన స్థాయిలోనే ఉన్నట్లు తెలిపారు.   కాబట్టి తము ప్రస్తుతం భారత్‌ సావరిన్‌ రుణాలకు సంబంధించి ఆందోళన చెందాల్సింది ఏదీ లేదని పేర్కొన్నారు.

ఈ విషయంలో మేము ఆందోళన చెందుతున్న దేశాల జాబితాలో భారత్‌ లేదని స్పష్టం చేశారు. ఐఎంఎఫ్‌  మానిటరీ క్యాపిటల్‌ మార్కెట్స్‌ విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రంజిత్‌ సింగ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత్‌ ఆర్థిక, ఫైనాన్షియల్, సావరిన్‌ రుణాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి ‘‘నిర్వహించగలిగిన’’ స్థాయిలో ఉందని అన్నారు. భారతదేశంలో సార్వభౌమ రుణంలో బ్యాంక్‌ హోల్డింగ్స్‌ స్థాయి వాస్తవానికి దాదాపు 29 శాతం వద్ద ఉందని తెలిపారు. అయితే ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల 16 శాతం  సగటు కంటే ఎక్కువ ఉందని పేర్కొన్నారు. భారతదేశ ప్రభుత్వ రుణం– జీడీపీ నిష్పత్తి దాదాపు 87 శాతంగా ఉందని ఆయన చెప్పారు.     

చదవండి: షాకింగ్‌ న్యూస్‌...వడ్డీరేట్లు పెరిగే అవకాశం...ప్రభావమెంతంటే..?

మరిన్ని వార్తలు