15 నిమిషాల్లో రూ. 400 కోట్లు సంపాదించిన రేఖా ఝున్‌ఝున్‌వాలా

10 Apr, 2023 12:52 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ మహిళా వ్యాపారవేత్త రేఖా ఝున్‌ఝున్‌వాలా మరోసారి వార్తల్లో నిలిచారు. కేవలంలో 15 నిమిషాల్లో కోట్లాది రూపాయలను ఆర్జించారు. తన పోర్ట్‌ఫోలియోలోని టాటాగ్రూపునకు చెందిన  టైటన్‌, టాటా మోటార్స్‌ షేర్ల లాభాలతో ఆమె మరింత ధనవంతురాలిగా మారిపోయారు. ఏకంగా 400కోట్ల రూపాయలను తన నెట్‌వర్త్‌కు జోడించుకున్నారు.

ఈ ఆర్థికసంవత్సరంలో వ్యాపార వృద్ది, ఇతర వ్యాపార అప్‌డేట్స్‌తో సోమవారంనాటి మార్కెట్‌లో టైటన్‌, టాటా మోటార్స్‌ షేర్లలో భారీ కొనుగోళ్లు జరిగాయి. రేఖా  పోర్ట్‌ ఫోలియోలోని షేర్ల మార్నింగ్‌ డీల్స్‌తో ఆమె నికర విలువ ఆకాశానికి ఎగిసింది. ట్రేడింగ్‌ ఆరంభం 15 నిమిషాల్లోనే, టైటన్ షేరు ధర రూ. 2,598.70 గరిష్టాన్ని  తాకింది. మునుపటి ముగింపుతో పోలిస్తే రూ. 50కు పైనే ఎగిసింది. అదేవిధంగా, టాటా మోటార్స్ షేరు ధర రూ. 32.75 పెరిగింది.

రేఖా ఝున్‌ఝున్‌వాలా నెట్‌వర్త్‌ జూమ్
2022 అక్టోబర్ -డిసెంబర్ త్రైమాసికానికి టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ డేటా ప్రకారం, రేఖాకు 4,58,95,970 టైటాన్ షేర్ల ఉన్నాయి. ఇది కంపెనీ మొత్తం చెల్లించిన మూలధనంలో 5.17 శాతం. కాబట్టి, సోమవారం సెషన్‌లో మొదటి 15 నిమిషాల్లో టైటాన్ షేరు ధర పెరిగిన తర్వాత రేఖా నికర విలువ దాదాపు రూ.230 కోట్లు (రూ50.25 x 4,58,95,970)  పెరిగింది.

అలాగే టాటా మోటార్స్ షేర్లు   5,22,56,000  షేర్లు లేదా కంపెనీలో 1.57 శాతం వాటా. కాబట్టి, రేఖా నికర విలువలో మొత్తం పెరుగుదల దాదాపు రూ.170 కోట్లు (రూ.32.75 x 5,22,56,000). కాగా ప్రముఖ పెట్టుబడిదారుడు, దివంగత రాకేశ్‌ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా.

మరిన్ని వార్తలు