అంబానీ చేతికి హైదరాబాద్‌ కంపెనీ, లోటస్‌ చాకొలెట్‌లో రిలయన్స్‌ మరింత వాటా

7 Jan, 2023 09:27 IST|Sakshi

న్యూఢిల్లీ: లోటస్‌ చాకొలెట్‌లో మరో 26 శాతం వాటా కొనుగోలుకి రిలయన్స్‌ గ్రూప్‌ కంపెనీలు రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్, రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాయి. లోటస్‌ చాకొలెట్‌ వాటాదారుల నుంచి ఈ వాటాను సొంతం చేసుకునేందుకు ఓపెన్‌ ఆఫర్‌ చేపట్టనున్నట్లు తెలియజేశాయి. ఇందుకు షేరుకి రూ. 115.5 ధరను నిర్ణయించినట్లు 2 సంస్థల తరఫున ఆఫర్‌ను చేపట్టనున్న డీఏఎం క్యాపిటల్‌ తెలియజేసింది.

తద్వారా 33.38 లక్షల షేర్లను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. పూర్తి వాటాకు రూ. 38.56 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఓపెన్‌ ఆఫర్‌ ఫిబ్రవరి 21న ప్రారంభమై మార్చి 6న ముగియనున్నట్లు పబ్లిక్‌ నోటీస్‌ ద్వారా తెలియజేసింది.  

3 నెలల గరిష్టం 
రిలయన్స్‌ సంస్థలు కన్నేయడంతో లోటస్‌ చాకొలెట్‌ షేరు బీఎస్‌ఈలో గురువారం రూ. 149ను దాటి ముగిసింది. ఇది మూడు నెలల గరిష్టంకాగా.. శుక్రవారం(6న) సైతం షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 157 సమీపంలో నిలిచింది. కంపెనీ చాకొలెట్లు, కోకోవా ప్రొడక్టులు, డెరివేటివ్స్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

రిలయన్స్‌ కన్జూమర్‌.. రిలయన్స్‌ రిటైల్‌ ఎఫ్‌ఎంసీజీ విభాగంకాగా.. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ కంపెనీలివి. లోటస్‌ చాకొలెట్‌లో గత వారమే రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రమోటర్ల నుంచి 51 శాతం వాటాను చేజిక్కించుకుంది. 

>
మరిన్ని వార్తలు