ఇషా అంబానీ దూకుడు: శ్రీలంక కంపెనీతో డీల్‌, వాటికి బిగ్‌ షాకే!

31 Jan, 2023 21:39 IST|Sakshi

సాక్షి,ముంబై: రిలయన్స్‌ మరో వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. ఆయిల్‌నుంచి టెలికాం దాకా అడుగుపెట్టిన ప్రతీ రంగంలోనూ దూసుకుపోతున్న రిలయన్స్‌ త్వరలోనే ఇండియా బిస్కెట్ల వ్యాపారంలోకి ప్రవేశించనుంది. ఇందుకోసం శ్రీలంక ఆధారిత మాలిబాన్ బిస్కెట్ మాన్యుఫాక్టరీస్ (ప్రైవేట్) లిమిటెడ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. 

మాలిబాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు రిలయన్స్‌ ఎఫ్‌ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) తెలిపింది. దేశీయ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వినియోగదారు బ్రాండ్‌ను ఇండియాకు తీసుకురావడమే లక్ష్యమని తెలిపింది. ఇందులో భాగంగానే మాలిబన్ బిస్కెట్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అయితే దేశీయ బిస్కెట్ల మార్కెట్లో 80 శాతం వాటా ఉన్న దిగ్గజాలు బ్రిటానియా,ఐటీసీ, పార్లేకు గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

దీనిపై రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ సంతోషం ప్రకటించారు. తమ ఎఫ్ఎంసీజీ పోర్ట్‌ఫోలియోను గొప్ప బ్రాండ్ ద్వారా బలోపేతం చేయడమే కాకుండా, తమ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా అద్భుత  సేవలందించ గలుగుతామన్నారు. కాగా ఏడాది డిసెంబరులో  గుజరాత్‌లో మేడ్-ఫర్-ఇండియా కన్స్యూమర్  ప్యాకేజ్డ్ గూడ్స్ బ్రాండ్ ‘ఇండిపెండెన్స్‌’ ను ప్రారంభించిన సంగతి తెలిసిదే.

RCPLతో భాగస్వామ్యంపై మాలిబాన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కుముదిక ఫెర్నాండో మాట్లాడుతూ, “రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ మాలిబన్‌తో  భాగస్వామ్యాన్ని ఎంచు కోవడం సంతోషమని, దాదాపు 70 సంవత్సరాలుగా అత్యున్నత  నాణ్యతా ప్రమాణాలను కొనసాగించడంలోతమ  అంకితభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. 

1954లో స్థాపితమైన మాలిబాన్‌ శ్రీలంకలో రెండవ అతిపెద్ద బిస్కెట్ కంపెనీగా పాపులర్‌. బిస్కెట్లు, క్రాకర్లు, కుకీలు,  ఇతర  ఉత్పత్తులను  35 దేశాలకు ఎగుమతి చేస్తోంది. 
 

మరిన్ని వార్తలు