Reliance: 100 శాతం ఆర్గానిక్ కాఫీ: ఫుడ్‌ బిజినెస్‌లోకి రిలయన్స్‌

1 Jul, 2022 10:57 IST|Sakshi

సాక్షి,ముంబై: బిలియనీర్ ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ, రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (ఆర్‌బీఎల్‌) ఆహార పదార్థాలు, పానీయాల రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం యూకేకు చెందిన ఫుడ్  అండ్‌ ఆర్గానిక్‌ కాఫీ చెయిన్‌ ప్రెటా మౌన్‌రేతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు సంస్థ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.  

ప్రెటా మౌన్‌రేకు దీర్ఘకాలిక మాస్టర్‌ ఫ్రాంచైజీగా కంపెనీ వ్యవహరించనుంది. ముందుగా  ప్రధాన నగరాలు, ట్రావెల్ హబ్‌లతో ప్రారంభించి,  ఆ తరువాత దేశవ్యాప్తంగా  విస్తరించనున్నామని  ఆర్‌బీఎల్‌ ప్రకటించింది. దేశీయ వినియోగదారులకు అభిరుచులకు అనుగుణంగా తాజా, సేంద్రీయ ఆహార పదార్థాల్ని అందించాలనేదే లక్ష్యమని రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ ఎండీ దర్శన్ మెహతా వెల్లడించారు. 

ఆసియాలో  రెండు దశాబ్దాల క్రితం తొలి ప్రెట్ ఔట్‌లెట్‌ను ప్రారంభించిన  ప్రెటా మౌన్‌రేకు ఆర్‌బీఎల్‌తో భాగస్వామ్యం సంతోషాన్నిస్తోందని సీఈఓ పనో క్రిస్టౌ తెలిపారు.  కస్టమర్లకు ఫ్రెష్‌ ఫుడ్‌తోపాటు,   100% ఆర్గానిక్ కాఫీని  అందిస్తామన్నారు.
 
కాగా అతిపెద్ద రిటైల్ ప్లాట్‌ఫామ్‌గా ఉన్న ఆబీఎల్‌ గత 14  ఏళ్లుగా దేశంలో గ్లోబల్ బ్రాండ్‌ ఉత్పత్తులను అందిస్తోంది.  అలాగే ‘రెడీ టు ఈట్' అంటూ  తొలిసారిగా 1986లో లండన్‌లో ప్రారంభమైం‍ది ప్రెటా మౌన్‌రే. యూకే, యూఎస్, హాంగ్‌కాంగ్, ఫ్రాన్స్, దుబాయి తదితర దేశాల్లో మొత్తం 550 ఔట్‌లెట్లను నిర్వహిస్తోంది.  ఆర్గానిక్ కాఫీ, శాండ్‌విచ్‌లు, సలాడ్‌లు, ర్యాప్‌లను అందిస్తోంది ప్రెటా మౌన్‌రే 

మరిన్ని వార్తలు