రిలయన్స్‌ ‘ఫార్మా’ షాపింగ్‌ !

20 Aug, 2020 04:07 IST|Sakshi

నెట్‌మెడ్స్‌ కైవసం

మెజారిటీ 60 శాతం వాటాల కొనుగోలు

డీల్‌ విలువ రూ. 620 కోట్లు

న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) వివిధ రంగాల్లోకి వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఈ–ఫార్మసీ విభాగంలో మరో సంస్థను దక్కించుకుంది. నెట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటాలు (60 శాతం) కొనుగోలు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ డీల్‌ విలువ రూ. 620 కోట్లు. దీనితో వైటలిక్‌ హెల్త్‌లో 60 శాతం, దాని అనుబంధ సంస్థల్లో 100 శాతం (అన్నింటినీ కలిపి నెట్‌మెడ్స్‌గా వ్యవహరిస్తారు) వాటాలు ఆర్‌ఐఎల్‌కు దక్కుతాయి. డిజిటల్‌ విభాగం జియో ద్వారా కాకుండా రిటైల్‌ విభాగం ద్వారా ఆర్‌ఐఎల్‌ ఈ కొనుగోలు జరిపింది.

ఈ–ఫార్మసీ విభాగానికి సంబంధించి ఆర్‌ఐఎల్‌ గతేడాదే సి–స్క్వేర్‌ అనే సంస్థను కొనుగోలు చేసింది. ఫార్మా రంగ డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు ఇది సాఫ్ట్‌వేర్‌ అందిస్తోంది. గడిచిన మూడేళ్లుగా ఆర్‌ఐఎల్‌ దాదాపు 3.1 బిలియన్‌ డాలర్ల విలువ చేసే కొనుగోళ్లు జరిపింది. ఈ డీల్స్‌లో 13 శాతం రిటైల్, 80 శాతం టెలికం.. మీడియా .. టెక్నాలజీ, మరో 6 శాతం ఇంధన రంగానికి చెందినవి ఉన్నాయి. గ్రూప్‌లో భాగమైన జియోమార్ట్‌ కేవలం నిత్యావసరాలకు మాత్రమే పరిమితం కాకుండా ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్‌ తదితర ఉత్పత్తులను కూడా డెలివరీ చేయనున్నట్లు గత నెల జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆర్‌ఐఎల్‌ వెల్లడించింది. ఆ దిశగా నెట్‌మెడ్స్‌ కొనుగోలు కంపెనీకి ఉపయోగపడనుంది.  

కన్సల్టింగ్‌ నుంచి ఔషధాల దాకా అన్నీ ఒకే చోట..
పటిష్టమైన డిజిటల్, ఈ–కామర్స్‌ వ్యవస్థను రూపొందించుకోవడంపై కంపెనీ మరింతగా దృష్టి పెడుతోందనడానికి ఈ కొనుగోలు నిదర్శనమని కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది.  ‘ప్రస్తుతం ఆర్‌ఐఎల్‌ తమ ఆన్‌లైన్‌ యాప్‌ జియోహెల్త్‌ హబ్‌ ద్వారా డిజిటల్‌ కన్సల్టేషన్, డయాగ్నొస్టిక్‌ టెస్టుల సర్వీసులు అందిస్తోంది. నెట్‌మెడ్స్‌ కొనుగోలుతో ఔషధాల డెలివరీ విభాగంలోకి కూడా దిగినట్లవుతుంది. టెలీకన్సల్టేషన్‌ అనంతరం, ప్రిస్క్రిప్షన్‌ను యాప్‌లో పొందుపర్చవచ్చు. ఆ తర్వాత పేషెంట్లకు అటు వైద్య పరీక్షలు ఇటు డాక్టరు సూచించిన ఔషధాలకు కలిపి కస్టమైజ్డ్‌ ఆఫర్‌లాంటివి ఇవ్వచ్చు‘ అని క్రెడిట్‌ సూసీ పేర్కొంది. సాధారణగా డెలివరీ ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆన్‌లైన్‌ ఫార్మసీలో మార్జిన్లు తక్కువగా ఉంటాయని, కాకపోతే దేశీయంగా భారీ మార్కెట్‌ కావడం వల్ల వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. ఆన్‌లైన్‌ ఫార్మసీ మార్కెట్‌ను ఆర్‌ఐఎల్‌ గణనీయంగా విస్తరించే అవకాశం ఉందని వివరించింది.  

రిటైల్‌ నెట్‌వర్క్‌ ఊతం..
దేశీయంగా మొత్తం ఔషధాల మార్కెట్‌ ఏకంగా 18–19 బిలియన్‌ డాలర్ల భారీ పరిమాణంలో ఉండగా ఆన్‌లైన్‌ ఔషధ మార్కెట్‌ వాటా ప్రస్తుతం సుమారు 3–3.5 శాతం స్థాయికే పరిమితమైంది. ప్రస్తుతం ఉన్న సంస్థలు సత్వర డెలివరీ సేవలు ఇవ్వలేకపోతుండటం, కస్టమర్లకు ఔషధాలు చేరాలంటే కనీసం 24–48 గంటల దాకా సమయం పట్టేస్తుండటం ఈ విభాగానికి ప్రతికూలాంశంగా ఉంటోంది. అయితే, దేశవ్యాప్తంగా రిటైల్‌ స్టోర్లు ఉండటం ఆర్‌ఐఎల్‌కు లాభించే అంశమని క్రెడిట్‌ సూసీ పేర్కొంది.  ‘భారీ సంఖ్యలో రిటైల్‌ నెట్‌వర్క్‌ ఉన్నందున డెలివరీ సమయాన్ని ఆర్‌ఐఎల్‌ గణనీయంగా తగ్గించడానికి వీలుంది. కంపెనీపరంగా డెలివరీ వ్యయాలూ తక్కువగా ఉంటాయి. తద్వారా మార్కెట్‌ను పెంచుకోవచ్చు‘ అని క్రెడిట్‌ సూసీ పేర్కొంది. నిత్యావసరాలకు సంబంధించి కిరాణా దుకాణాలకు అగ్రిగేటర్‌గా వ్యవహరిస్తున్నట్లే మధ్యకాలికంగా చిన్నా, చితకా మెడికల్‌ హాల్స్‌కు కూడా ఆర్‌ఐఎల్‌ అగ్రిగేటర్‌గా వ్యవహరించే అవకాశం ఉందని తెలిపింది.

670 పట్టణాల్లో  నెట్‌మెడ్స్‌..
నెట్‌మెడ్స్‌ దేశీయంగా ప్రిస్క్రిప్షన్, ఓటీసీ (ఓవర్‌ ది కౌంటర్‌), ఆరోగ్యం, వెల్‌నెస్‌ ఉత్పత్తులను ఆన్‌లైన్‌ ఫార్మసీ ద్వారా అందిస్తోంది. ఫార్మా రిటైలింగ్, తయారీలో సుదీర్ఘానుభవం ఉన్న ప్రమోటర్లు దీన్ని ఏర్పాటు చేశారు. 2018 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయాలు 1 మిలియన్‌ డాలర్లకు పైగా నమోదైనట్లు ఆర్‌ఐఎల్‌ తెలిపింది. నెట్‌మెడ్స్‌ ప్రస్తుతం 670 నగరాలు, పట్టణాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 70,000 పైచిలుకు ప్రిస్క్రిప్షన్, లైఫ్‌స్టయిల్‌ ఔషధాలు .. వెల్‌నెస్, ఆరోగ్యం, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించి వేల కొద్దీ సంఖ్యలో నాన్‌–ప్రిస్క్రిప్షన్‌ ఉత్పత్తులను అందిస్తోంది. యాప్‌ ద్వారా డాక్టర్‌ కన్సల్టేషన్‌ సేవలు కూడా అందిస్తోంది.

మరిన్ని వార్తలు