ఎన్నాళ్ల కెన్నాళ్లకు..లాభాల్లోకి అనిల్ అంబానీ సంస్థ

12 Nov, 2022 08:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ కంపెనీ రిలయన్స్‌ క్యాపిటల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో తిరిగి లాభాల్లోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో రూ. 215 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది.

గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 1,116 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 6,002 కోట్ల నుంచి రూ. 6,047 కోట్లకు పుంజుకుంది. 

ప్రస్తుత క్యూ2లో రూ. 290 కోట్ల పన్నుకుముందు లాభం ఆర్జించగా.. గత క్యూ2లో రూ. 1,115 కోట్ల నిర్వహణా నష్టం ప్రకటించింది. రుణ చెల్లింపుల వైఫల్యం నేపథ్యంలో గతేడాది నవంబర్‌లో ఆర్‌బీఐ కంపెనీ బోర్డును రద్దు చేయడంతోపాటు.. వై.నాగేశ్వరరావును పాలనాధికారిగా నియమించిన సంగతి తెలిసిందే. ఫలితాల నేపథ్యంలో రిలయన్స్‌ క్యాపిటల్‌ షేరు బీఎస్‌ఈలో దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 11.22 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు