Anil Ambani: రిలయన్స్‌ క్యాప్‌ రుణ భారం డౌన్‌!

15 Sep, 2021 12:06 IST|Sakshi

ముంబై: రుణ పరిష్కార(రిజల్యూషన్‌) ప్రణాళికలు విజయవంతమైతే రిలయన్స్‌ క్యాపిటల్‌ రుణ భారం సగానికి(50 శాతం) తగ్గే వీలున్నట్లు కంపెనీ చైర్మన్‌ అనిల్‌ అంబానీ తాజాగా పేర్కొన్నారు. రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌(ఆర్‌సీఎఫ్‌), రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌(ఆర్‌హెచ్‌ఎఫ్‌)ల రిజల్యూషన్‌ పూర్తయితే రిలయన్స్‌ క్యాపిటల్‌ కన్సాలిడేటెడ్‌ రుణాల్లో రూ. 20,000 కోట్లమేర కోత పడనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది మొదట్లో ఆర్‌సీఎఫ్, ఆర్‌హెచ్‌ఎఫ్‌ల కొనుగోలుకి ఆథమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన బిడ్‌ను రుణదాతలు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటైన ఐసీఏలో భాగంగా రుణదాతలు రిజల్యూషన్‌ ప్రణాళికను అనుమతించారు.  

మెజారిటీ వాటాలు 
రిలయన్స్‌ క్యాపిటల్‌కు ఆర్‌సీఎఫ్‌లో 100 శాతం, ఆర్‌హెచ్‌ఎఫ్‌లో మెజారీటీ వాటా ఉంది. రిలయన్స్‌ క్యాపిటల్‌ ఏకీకృత రుణ భారం రూ. 40,000 కోట్లుగా నమోదైంది. ఆర్‌సీఎఫ్, ఆర్‌హెచ్‌ఎఫ్‌లకు రూ. 20,000 కోట్ల రుణాలున్నట్లు అంబానీ పేర్కొన్నారు. దీంతో ఈమేర రుణ భారం తగ్గే వీలున్నట్లు కంపెనీ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) సందర్భంగా అనిల్‌ అంబానీ ఈ వివరాలు వెల్లడించారు. రిజల్యూషన్‌ తదుపరి రిలయన్స్‌ క్యాపిటల్‌కు ఎన్‌సీడీల ద్వారా రూ. 15,000 కోట్లు, అన్‌సెక్యూర్డ్, గ్యారంటీడ్‌ ద్వారా రూ. 5,000 కోట్లు చొప్పున రుణ భారం మిగలనున్నట్లు వివరించారు. ఆర్‌సీఎఫ్‌ కోసం రూ. 2,200 కోట్లు, ఆర్‌హెచ్‌ఎఫ్‌కు రూ. 2,900 కోట్లు చొప్పున ఆథమ్‌ చెల్లించనున్నట్లు తెలియజేశారు. ఈ రెండు కంపెనీల ఉద్యోగులందరినీ కొనసాగించేందుకు ఆథమ్‌ కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వార్తల నేపథ్యంలో రిలయన్స్‌ క్యాపిటల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5% జంప్‌చేసి రూ. 19.70 వద్ద ముగిసింది. 

ఏజీఎంలో  చైర్మన్‌ అనిల్‌ అంబానీ వెల్లడి 
రిలయన్స్‌ ఇన్‌ఫ్రా (ఆర్‌ఇన్‌ఫ్రా)కు అనుకూలంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) నుంచి తమకు రూ. 7,100 కోట్లు వస్తాయని కంపెనీ చైర్మన్‌ అనిల్‌ అంబానీ తెలిపారు. ఈ నిధులను రుణాల చెల్లింపునకు వినియోగిస్తామని, తద్వారా ఆర్‌ఇన్‌ఫ్రా రుణరహిత సంస్థగా మారగలదని వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) ఆయన పేర్కొన్నారు. ఆర్‌ఇన్‌ఫ్రాలో భాగమైన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (డీఏఎంఈపీఎల్‌).. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లైన్‌ను నిర్వహించేది. కాంట్రాక్టు నిబంధనలను డీఎంఆర్‌సీ ఉల్లంఘించిందన్న ఆరోపణలపై డీఏఎంఈపీఎల్‌ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీనికి సంబంధించి డీఏఎంఈపీఎల్‌కు రావాల్సిన పరిహారం విషయంలో కంపెనీకి అనుకూలంగా సుప్రీం కోర్టు ఇటీవలే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అనిల్‌ అంబానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు