మరో వ్యాపారంలోకి అంబానీ!.. రూ.27 కోట్ల డీల్

10 Feb, 2024 14:13 IST|Sakshi

'రావల్‌గావ్ షుగర్ ఫామ్' (Ravalgaon Sugar Farm) ఐకానిక్ క్యాండీ బ్రాండ్‌ త్వరలో 'ముకేశ్ అంబానీ' చేతుల్లోకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ కంపెనీ కొనుగోలుకు 'రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్' రూ. 27 కోట్ల డీల్ కూడా కుదుర్చుకున్నట్లు సమాచారం.

మ్యాంగో మూడ్, కాఫీ బ్రేక్, టట్టీ ఫ్రూటీ, పాన్ పసంద్, చాకో క్రీమ్, సుప్రీమ్ వంటి ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన రావల్‌గావ్ షుగర్ ఫామ్, తన ట్రేడ్‌మార్క్‌లు, వంటకాలు వంటి అన్ని హక్కులను రిలయన్స్ కన్స్యూమర్‌కు విక్రయించినట్లు శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది.

సుమారు రూ. 27 కోట్ల డీల్‌తో కంపెనీని విక్రయించడానికి డైరెక్టర్ల బోర్డు కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం. గత కొంతకాలంగా కంపెనీ మార్కెట్ వాటా తగ్గుముఖం పట్టడం వల్ల వ్యాపారాన్ని కొనసాగించడంలో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. పెరిగిన ముడిసరుకుల ధరల వల్ల పెట్టుబడి ఎక్కువవుతోండటంతో.. విక్రయానికి సిద్దమైపోతోంది.

రావల్‌గావ్ షుగర్ ఫామ్ అనేది రావల్‌గావ్ వాల్‌చంద్ గ్రూప్‌లో భాగంగా 1933లో ఏర్పాటైంది. ప్రారంభంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొని నిలదొక్కుకున్నప్పటికీ క్రమంగా లాభాలు క్షీణించాయి. 2023 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం కేవలం 9.66 కోట్ల రూపాయలు మాత్రమే.

ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌లు పనిచేయవు! కారణం ఇదే..

కరోనా మహమ్మారి దేశంలో విజృంభించిన సమయంలో స్కూల్స్, ఆఫీసులు వంటివన్నీ నెలల తరబడి మూతపడి ఉన్నాయి. ఇది కంపెనీ వ్యాపారాన్ని గట్టిగా దెబ్బతీసింది. కరోనా తగ్గిన తరువాత కూడా కంపెనీ లాభాలు వృద్ధి చెందక పోవడం వల్ల సంస్థను అమ్మడానికి పూనుకుంది.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega