‘ఫ్యూచర్‌’ డీల్‌కు గడువు పెంపు

3 Apr, 2021 06:36 IST|Sakshi

ఆరు నెలలు పొడిగించిన రిలయన్స్‌ రిటైల్‌

2021 సెప్టెంబర్‌ 30వరకూ తాజా గడువు

ఆర్‌ఐఎల్‌ నుంచి ఓటూసీ బిజినెస్‌ విడదీత

రుణదాతలు, వాటాదారుల నుంచి గ్రీన్‌సిగ్నల్‌

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ తాజాగా ఫ్యూచర్‌ గ్రూప్‌తో కుదుర్చుకున్న డీల్‌ను పూర్తిచేసేందుకు వీలుగా గడువును పొడిగించింది. గతేడాది ఫ్యూచర్‌ గ్రూప్‌ రిటైల్‌ ఆస్తులు, హోల్‌సేల్‌ బిజినెస్‌ల కొనుగోలుకి కుదుర్చుకున్న ఒప్పందం గడువు 2021 మార్చి31తో ముగియనుడంటంతో.. సెప్టెంబర్‌ 30వరకూ పొడిగించింది. ‘లాంగ్‌ స్టాప్‌ డేట్‌’లో భాగంగా ఆరు నెలల పాటు గడువును పొడిగించినట్లు రిలయన్స్‌ రిటైల్‌ పేర్కొంది.

కిశోర్‌ బియానీ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్‌ బిజినెస్‌ల కొనుగోలుకి 2020 ఆగస్ట్‌లో రూ. 24,713 కోట్లకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. విలీనాలు, కొనుగోళ్ల విషయంలో కంపెనీలు ఒప్పందాలను పూర్తిచేసుకునేందుకు వీలుగా లాంగ్‌ స్టాప్‌ను వినియోగిస్తుంటాయని విశ్లేషకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా.. తమతో కుదుర్చుకున్న కాంట్రాక్టును ఉల్లంఘించిందంటూ ఈ డీల్‌ విషయంలో ఫ్యూచర్‌ గ్రూప్‌నకు వ్యతిరేకంగా ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించిన విషయం విదితమే. రిలయన్స్‌ రిటైల్, ఫ్యూచర్‌ గ్రూప్‌ డీలపై ఇప్పటికే సీసీఐ, సెబీ క్లియరెన్స్‌ ఇచ్చినప్పటికీ.. అమెజాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది.

ప్రత్యేక యూనిట్‌గా ఓటూసీ..
ఆయిల్‌ టు కెమికల్స్‌(ఓటూసీ) బిజినెస్‌ను ప్రత్యేక యూనిట్‌గా విడదీసేందుకు రుణదాతలు, వాటాదారులు అనుమతించినట్లు రిలయన్స్‌ తాజాగా పేర్కొంది. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) మార్గదర్శకాల ప్రకారం ఈ అంశంపై రుణదాతలు, వాటాదారుల సమా వేశాన్ని నిర్వహించింది. ఇందుకు అనుకూలంగా సెక్యూర్డ్‌ క్రెడిటార్లు, రుణదాతలు, వాటాదారుల నుంచి ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో దాదాపు 100% ఓటింగ్‌ నమోదైనట్లు ఎక్సే్ఛంజీలకు ఆర్‌ఐఎల్‌ తెలిపింది. ఈ సమావేశాలకు సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ బీఎన్‌ శ్రీకృష్ణ అధ్యక్షత వహించినట్లు పేర్కొంది. రిఫైనింగ్, ఇంధన మార్కెటింగ్, పెట్రోకెమ్‌ బిజినెస్‌లను ఓటూసీగా విడదీసేందుకు ఫిబ్రవరిలో ఆర్‌ఐఎల్‌ ప్రణాళికలు వేయడం తెలిసిందే. స్వతంత్రంగా ఏర్పాటయ్యే ఈ యూనిట్‌కు మాతృసంస్థ 25 బిలియన్‌ డాలర్ల రుణాన్ని సమకూర్చనున్నట్లు ప్రకటించింది. అలాగే సౌదీ అరామ్‌కో తదితర గ్లోబల్‌ ఇన్వెస్టర్లకు వాటాలు విక్రయించనున్నట్లు ఆర్‌ఐఎల్‌ తెలియజేసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు