మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న రిలయన్స్‌ ఫౌండేషన్‌..!

2 Aug, 2021 21:24 IST|Sakshi

ముంబై: ప్రముఖ ప్రైవేటు దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. రిలయన్స్‌ ఫౌండేషన్‌ తరపున బలహీన వర్గ ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనుంది. బృహణ్‌ ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌(బీఎమ్‌సీ), రిలయన్స్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా ముంబై నగరంలోని సుమారు 50 మురికివాడల్లో నివసిస్తోన్న ప్రజలకు దాదాపు మూడు లక్షల కరోనా వ్యాక్సిన్లను ఇవ్వనుంది. రిలయన్స్‌ ఫౌండేషన్‌ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని  సర్‌ హెచ్‌.ఎన్‌.రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రి మూడు నెలలపాటు నిర్వహించనుంది.  

ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ ధారావి, వర్లీ, వడాలా, కొలాబా, ప్రతీక్ నగర్, కామాతీపుర, మంఖుర్ద్, చెంబూర్, గోవండి,  భండూప్‌తో సహా పరిసర ప్రాంతాల్లో రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహించనుంది. సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అత్యాధునిక మొబైల్ వాహన విభాగాన్ని ముంబైలోని ఎంపిక చేసిన ప్రదేశాలలో వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమానికి రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహించనుంది. 

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు,   చైర్‌పర్సన్ నీతా ఎం అంబానీ మాట్లాడుతూ..కోవిడ్‌-19 మహమ్మారికి వ్యతిరేకంగా భారత్‌ చేస్తున్న నిరంతర పోరాటంలో రిలయన్స్ ఫౌండేషన్ దేశానికి అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ నుంచి ప్రజలను రక్షించడానికి సామూహిక టీకా డ్రైవ్‌లే అతిపెద్ద ఆయుధమని తెలిపారు. ప్రతి ఒక్క భారతీయుడు వీలైనంత త్వరగా టీకాలను వేయించుకోవాలని పిలుపునిచ్చారు.  కరోనాతో చేస్తోన్న యుద్ధంలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ చేయగలిగినదంతా చేయడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. త్వరలోనే కరోనాను అంతంచేసి, మంచి రోజులు మళ్లీ మనకు  వస్తాయనే నమ్మకం ఉందని నీతా అంబానీ అభిప్రాయపడ్డారు. 

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దేశనలుమూలల్లో కరోనా టెస్టింగ్​, లిక్విడ్​ మెడికల్ ఆక్సిజన్ సరఫరాను ఉచితంగా చేసింది. అంతేకాకుండా సుమారు కోటి మాస్క్‌లు, ఏడున్నర కోట్ల భోజనాలు, కోవిడ్ రోగుల చికిత్స కోసం 2వేలకు పైగా వెంటిలేటర్‌ బెడ్స్‌ను పంపిణీ చేసింది. కరోనా పట్ల ప్రజల్లో చైతన్యం కల్పించడం కోసం అనేక కార్యక్రమాలను నిర్వహించింది. మిషన్ వ్యాక్సిన్ సురక్ష  కార్యక్రమంలో భాగంగా రిలయన్స్ గ్రూప్స్​లో పని చేస్తోన్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, డిపెండెంట్స్​ కోసం సంస్థ ఇప్పటికే దాదాపు 10లక్షల వ్యాక్సిన్ డోసులను కేటాయించింది.


 

మరిన్ని వార్తలు