రిలయన్స్‌ నుంచి.. ప్రత్యేక కంపెనీగా జియో ఫైనాన్షియల్‌

22 Oct, 2022 07:40 IST|Sakshi

వాటాదారులకు విడిగా షేర్ల జారీ

స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌  

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడి  

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్‌ సర్వీసులను ప్రత్యేక కంపెనీగా విడదీయనున్నట్లు జులై–సెప్టెంబర్‌(క్యూ2) ఫలితాల విడుదల సందర్భంగా డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. ఇందుకు తాజాగా బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలియజేసింది. వెరసి సొంత అనుబంధ సంస్థ రిలయన్స్‌ స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎస్‌ఐఎల్‌)ను జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(జేఎఫ్‌ఎస్‌ఎల్‌) పేరుతో ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.

దీనిలో భాగంగా ఆర్‌ఐఎల్‌ వాటాదారులకు తమ వద్ద గల ప్రతీ షేరుకీ ఒక జేఎఫ్‌ఎస్‌ఎల్‌ షేరుని జారీ చేయనుంది. కంపెనీ షేర్లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టింగ్‌ చేయనుంది. జేఎఫ్‌ఎస్‌ఎల్‌.. కన్జూమర్, మర్చంట్‌ రుణాల బిజినెస్‌తోపాటు.. బీమా, ఆస్తుల నిర్వహణ, డిజిటల్‌ బ్రోకింగ్‌ తదితర విభాగాలలోకి ప్రవేశించనున్నట్లు ఆర్‌ఐఎల్‌ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా విస్తరణ, భాగస్వామ్య సంస్థల ఏర్పాటు, ఇతర కంపెనీల కొనుగోళ్లు తదితరాలను చేపట్టనున్నట్లు తెలియజేసింది. డిపాజిట్లు స్వీకరించని ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్‌బీఐ అనుమతిగల జేఎఫ్‌ఎస్‌ఎల్‌కు రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌(ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌)లో పెట్టుబడులను సైతం బదిలీ చేయనున్నట్లు వివరించింది.

చదవండి: ఆర్ధిక మాంద్యంపై ఎలాన్‌ మస్క్‌ రియాక్షన్‌ ఇదే

మరిన్ని వార్తలు