‘భారతీయుల హృదయాల్లో రిలయన్స్ చిరస్థాయిగా నిలిచిపోవాలి’

7 Jan, 2023 19:06 IST|Sakshi

ముకేశ్ అంబానీ. భారతదేశంలో ఈ పేరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత. రిటైల్ రంగాన్ని పరుగులు తీయిస్తున్న కార్పొరేట్ దిగ్గజం. ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా 5G సేవలను అందించేందుకు శ్రమిస్తున్న వ్యాపారవేత్త. ‘రిలయన్స్ ఇండియా’ను హరిత కార్పొరేట్‌గా మలచాలని కలలు కంటున్న వ్యూహకర్త. ఏటా తన తండ్రి ధీరూబాయి పుట్టిన రోజును ‘రిలయన్స్ ఫ్యామిలీ డే’ గా నిర్వహిస్తారు. కంపెనీలోని అన్ని స్థాయుల ఉద్యోగులతో సంభాషిస్తారు. వారికి దిశానిర్దేశం చేస్తారు.

గత ఏడాది ఇదే కార్యక్రమంలో తన పిల్లలు ముగ్గురికి కంపెనీ వారసత్వ పగ్గాలను అప్పగించారు. టెలికాం, డిజిటల్ బిజినెస్ పెద్ద కొడుకు ఆకాశ్‌కి, కవల సోదరి ఇషాకు రిటైల్, చిన్న కొడుకు అనంత్‌కు ఎనర్జీ బిజినెస్ అప్పగించారు. ఈ సారి ఫ్యామిలీ డే సందర్భంగా ఆయన ప్రసంగం మరింత ఉత్తేజ భరితంగా సాగింది.

వచ్చే ఐదేళ్లలో రిలయన్స్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని, సంస్థల్లోని నాయకులు, ఉద్యోగులు అంతా అంచనాలను అందుకోవాలని చెప్పారు. అర్జెంటీనా జట్టును ప్రేరణగా తీసుకుని ముందుకు సాగిపోవాలని చెప్పారు. భారతీయుల హృదయాల్లో రిలయన్స్ చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాక్షించారు.

ఇతర అంశాలు ఆయన మాటల్లోనే...
జనహృదయాల్లో చిరస్థాయిగా రిలయన్స్ ‘‘కాలం పరిగెడుతుంది. రిలయెన్స్ సంస్థ మర్రిచెట్టు మాదిరిగా శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. దాని కొమ్మలు విశాలమవుతాయి. వేళ్లు మరింత లోతుకు చొచ్చుకుపోతాయి. ఎందరో భారతీయుల జీవితాలను అది స్పృశిస్తుంది. సుసంపన్నం చేస్తుంది. వారికి సాధికారతను ఇస్తుంది. పెంచి పోషిస్తుంది. సంరక్షిస్తుందన్నారు ముకేశ్ అంబానీ.

ఈ ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా 5G సేవలు
‘ఆకాశ్ నేతృత్వంలో జియో ప్రపంచంలోని ఏ ఇతర దేశాలలో కంటే భారత్‌లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. 2023 నాటికి 5G మోహరింపు పూర్తవుతుంది.

జియో ప్లాట్ ఫామ్స్ అన్నీ డిజిటల్ ప్రోడక్ట్స్‌ను, పరిష్కారాలను అందిస్తూ తమకు దక్కిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే ప్రతి గ్రామానికి 5జీ కనెక్టివిటీ ఏర్పడుతుంది. దీనివల్ల గ్రామీణ-పట్టణ అన్న అంతరం తొలుగుతుంది. అత్యున్నత విద్య, అత్యున్నత ఆరోగ్య సంరక్షణ, అత్యున్నత వాణిజ్య కలపాలు సాధ్యమవుతాయి. జియో వల్ల సంఘటిత అభివృద్ధి వేగవంతం అవుతుందని’ అన్నారు.

భారత సంఘటిత అభివృద్ధిలో పాత్ర
‘ఇషా ఆధ్వర్యంలోని రిటైల్ వ్యాపారం కూడా విస్తృతంగా, మరింత లోతుగా చొచ్చుకుపోతోంది. మరింత ఉన్నతమైన లక్ష్యాలు, గమ్యాలను వెతుక్కుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అధిక ఉపాధి కల్పన, రైతులకు అధిక ఆదాయం, చిన్న, మధ్యతరహా తయారీ రంగం మరింత ఉత్పాదను సాధించటం, వ్యాపారులు మరింత సంపన్నులు కావటం ద్వారా భారత్ లోని సంఘటిత అభివృద్ధిలో రిటైల్ వ్యాపారం కూడా పరోక్ష ప్రభావాన్ని చూపుతుందన్నారు’ ముఖేశ్‌ అంబానీ

ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ రిఫైనింగ్ కాంప్లెక్సు
ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆయిల్ రిఫైనింగ్ కాంప్లెక్సు, పెట్రో కెమికల్ ప్లాంటులతో ఆయిల్–టు-కెమికల్ వ్యాపారంలోనూ గ్రూపు తన నాయకత్వ స్థానాన్ని నిలుపుకుంటోంది. అలాగే మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలను డిజిటల్ సర్వీసెస్ తో అనుసంధానం చేయటం వల్ల పరిశ్రమలో కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. ఎనర్జీ బిజినెస్లో.. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయటంతో పాటు, హైడ్రోజన్ బిజినెస్ లోకి ప్రవేశించటం వంటి అంశాలు కంపెనీ స్వరూప స్వభావాలనే మార్చివేస్తాయి.

కొత్తతరం వ్యాపార ప్రపంచంలోకి అనంత్ ప్రవేశించారు. జామ్ నగర్లో గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు వేగవంతంగా ముందుకు వెళుతున్నాం. విస్తృతిలోనూ, విలువ పరంగానూ ఖ్యాతి గడించిన రిలయెన్స్ ‘గ్రీన్ కార్పొరేట్’గా దిశగా అడుగులు వేస్తోంది. ఇంధన రంగంలో స్వయంసమృద్ధి ఇంధనరంగం ముందు స్పష్టమైన లక్ష్యాలున్నాయి. దిగుమతులపైన ఆధారపడటం తగ్గించి భద్రతను, స్వయంసమృద్ధిని సాధించాలి. చురుగ్గా, సాంకేతికంగా ముందుండటం వల్ల దీనిని సాధించవచ్చుని అన్నారు.

అర్జెంటీనా విజయమే ప్రేరణ
వ్యాపార రంగంలో విజయం సాధించాలంటే, నాయకత్వం, బృంద సభ్యుల పనితీరు ముఖ్యం. అర్జెంటీనానే అందుకు గొప్ప ఉదాహరణ. నాయకత్వం, మంచి బృందం కలవటం వల్లనే ఫుట్బాల్లో ఆ దేశం ప్రపంచకప్ గెల్చుకోగలిగింది. మెస్సీ తను సొంతంగా కప్ గెల్చుకోలేదు. అదే సమయంలో మెస్సీలాంటి సమర్థ నాయకత్వం లేకపోతే అర్జెంటీనా జట్టు విజయం సాధించి ఉండేది కాదు. మొదటి గేమ్లో వారు అపజయం పాలయ్యారు. విజయాన్ని శ్వాసించి.. విజయాన్ని కలగని.. విజయం సాధించేందుకు అవసరమైనదంతా చేసి.. చివరి పెనాల్టీ షాట్ వరకూ విజయాన్ని వెంటాడుతూ.. చివరికి గెలుపును సొంతం చేసుకున్నారు.

వివేకానందుని మంత్రం
మా తండ్రి ధీరుబాయి అంబానీ మాదిరిగానే నేనూ వివేకానందుని నుంచి ప్రేరణ పొందుతాను. ఒక ఆలోచనను ఎంచుకోండి. దాన్ని మీ జీవితంగా మలుచుకోండి. దాని గురించి ఆలోచించండి. దానిపైనే జీవించండి. మీ మనసు, శరీరం, నరాలు, కండరాలు, మీ శరీరంలోని అణువణువునూ అదే ఆలోచనతో నింపి, మిగిలిన ఆలోచనలన్నింటిని పక్కన పెట్టండి. అదే విజయానికి మార్గం. అదే గెలుపు మంత్రమంటూ ముగించారు ముకేశ్ అంబానీ.

చదవండి: కొత్త సంవత్సరం.. కస్టమర్లకు షాకిచ్చిన బ్యాంక్‌!

మరిన్ని వార్తలు