-

గుజరాత్‌ ప్రభుత్వంతో రిలయన్స్‌ భారీ ఒప్పందం..!

13 Jan, 2022 21:19 IST|Sakshi

ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రీన్‌ ఎనర్జీ దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా గుజరాత్‌ ప్రభుత్వంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ గురువారం రోజున జరిగిన వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్- 2022లో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా వివిధ ప్రాజెక్టుల ద్వారా గుజరాత్‌లో సుమారు రూ. 5.955 లక్షల కోట్లను ఆర్‌ఐఎల్‌ ఇన్వెస్ట్‌ చేయనుంది.  దీంతో గుజరాత్‌లో 10 లక్షల ప్రత్యక్ష/పరోక్ష ఉపాధి అవకాశాలను రిలయన్స్‌ కల్పించనుంది. 

కర్బన రహిత రాష్ట్రంగా..!
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు భారత్‌ను కర్భన రహిత దేశంగా మార్చేందుకు రిలయన్స్‌ కట్టుబడి ఉందని తెలిపింది. అంతేకాకుండా కర్బన రహితంగా రాష్ట్రంగా గుజరాత్‌ను మార్చేందుకుగాను రాష్ట్రంలో 100గిగావాట్ల పునరుత్పాదక శక్తి పవర్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ ఎకో-సిస్టమ్ రిలయన్స్‌ అభివృద్ధి చేయనుంది. 10 నుంచి 15 సంవత్సరాల వ్యవధిలో 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రిలయన్స్‌ పెట్టనుంది.

ఊతమిచ్చేలా..!
చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా, పునరుత్పాదక శక్తి, గ్రీన్ హైడ్రోజన్ క్యాప్టివ్ వినియోగానికి దారితీసే కొత్త సాంకేతికతలను, ఆవిష్కరణలను ఆయా సంస్థలకు ప్రోత్సహం లభిస్తోందని రిలయన్స్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. గుజరాత్‌లోని కచ్‌, బనస్కాంత, ధోలేరాల్లో గిగా ఫ్యాక్టరీల నిర్మాణం కోసం సంబంధించి భూమి కోసం రిలయన్స్‌ ఇప్పటికే అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు మొదలుపెట్టింది. కాగా కచ్‌లో 4.5 లక్షల ఎకరాల భూమి కావాలని రిలయన్స్‌ గుజరాత్‌ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. 

మరో రూ. 60 వేల కోట్లు..!
న్యూ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్-ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ మాన్యుఫ్యాక్చరింగ్‌ను ఏర్పాటు చేసేందుకుగాను రిలయన్స్‌ గుజరాత్‌లో మరో రూ. 60,000 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనుంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌తో సోలార్ పీవీ మాడ్యూల్ ఫ్యాక్టరీ, ఎలక్ట్రోలైజర్, ఇంధన నిల్వ, ఫ్యుయెల్‌ సెల్స్‌ కేంద్రాలను ఏర్పాటుచేయనుంది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో ప్రస్తుత ప్రాజెక్టుల్లో, కొత్త వెంచర్లలో 25,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. జియో నెట్‌వర్క్‌ను 5జీ అప్‌గ్రేడ్‌ చేసేందుకుగాను రూ.7,500 కోట్లు, రిలయన్స్ రిటైల్‌లో మరో రూ. 3,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని రిలయన్స్‌  ప్రతిపాదించింది. 

చదవండి: Indian Premier League: తెరపైకి మరో ప్లాన్‌తో టాటా..! సానుకూలంగా బీసీసీఐ..!

మరిన్ని వార్తలు