జూలైలో జియో జూమ్‌!!

24 Sep, 2021 05:37 IST|Sakshi

65 లక్షల కొత్త కనెక్షన్లు

భారతి ఎయిర్‌టెల్‌కు 19 లక్షల కొత్త యూజర్లు

14 లక్షలు తగ్గిన వొడా–ఐడియా కస్టమర్లు

ట్రాయ్‌ గణాంకాలు విడుదల

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో జోరు కొనసాగుతోంది. జూలైలో ఏకంగా 65.1 లక్షల కొత్త యూజర్లను దక్కించుకుని మార్కెట్‌ లీడర్‌గా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. దీనితో జులై ఆఖరు నాటికి జియో సబ్‌్రస్కయిబర్స్‌ సంఖ్య 44.32 కోట్లకు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొత్త కస్టమర్లను (34.8 లక్షలు) దక్కించుకున్న ఏకైక సంస్థ జియో ఒక్కటే. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జూలైలో భారతి ఎయిర్‌టెల్‌ కొత్త యూజర్ల సంఖ్య 19.42 లక్షలుగా నమోదు కాగా మొత్తం కనెక్షన్ల సంఖ్య 35.40 కోట్లకు ఎగిసింది.

అటు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్‌–ఐడియా యూజర్ల సంఖ్య మాత్రం 14.3 లక్షలు పడిపోయింది. దీంతో మొత్తం సబ్‌్రస్కయిబర్స్‌ సంఖ్య 27.19 కోట్లకు పరిమితమైంది. వైర్‌లెస్‌ కనెక్షన్ల మార్కెట్‌లో జూలై ఆఖరు నాటికి జియోకు 37.34 శాతం, భారతి ఎయిర్‌టెల్‌కు 29.83 శాతం, వొడా–ఐడియాకు 22.91 శాతం వాటా ఉంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న టెలికం రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులపై నాలుగేళ్ల మారటోరియం, 100 శాతం విదేశీ పెట్టుబడులు అనుమతించడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. దీంతో వొడాఫోన్‌ ఐడియాకు కాస్త ఊరట లభించనుంది.  

120 కోట్లకు కనెక్షన్లు..: ట్రాయ్‌ డేటా ప్రకారం దేశీయంగా టెలిఫోన్‌ కనెక్షన్లు 120.9 కోట్లకు చేరాయి. వైర్‌లెస్‌ విభాగంలో మొత్తం యూజర్ల సంఖ్య 118.6 కోట్లకు చేరింది. ఇక బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్ల మార్కెట్లో టాప్‌ 5 సరీ్వస్‌ ప్రొవైడర్ల వాటా 98.7 శాతంగా ఉంది. రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్, ఎట్రియా కన్వర్జెన్స్‌ సంస్థలు టాప్‌ 5లో ఉన్నాయి.   

మరిన్ని వార్తలు