ఎయిర్‌టెల్, జియోకు కొత్త యూజర్లు

19 Jan, 2022 02:19 IST|Sakshi

వొడాఫోన్‌కు చేజారిన కస్టమర్లు 

119.1 కోట్లకు టెలికం యూజర్లు 

న్యూఢిల్లీ: టెలికం చందాదారులు 2021 నవంబర్‌ నాటికి 119.05 కోట్లకు చేరుకున్నారు. గతేడాది నవంబర్‌ నెలలో రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ నికరంగా కొత్త యూజర్లను సంపాదించుకోగా, వొడాఫోన్‌ ఐడియా యూజర్లను కోల్పోయింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ను వెనక్కి నెట్టి రిలయన్స్‌ జియో ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ చందాదారుల పరంగా మొదటి స్థానానికి చేరుకుంది. వైర్‌లెస్‌ కస్టమర్లు మొత్తం మీద దేశంలో 116.7 కోట్లుగా ఉన్నారు. టెలికం రెగ్యులేటరీ సంస్థ (ట్రాయ్‌) గతేడాది నవంబర్‌ నెల గణాంకాలను మంగళవారం విడుదల చేసింది. 

♦రిలయన్స్‌ జియో 20,19,362 మంది చందారులను నికరంగా చేర్చుకుంది. మొత్తం చందాదారుల సంఖ్య 42.8 కోట్లకు పెరిగింది. 

♦ ఎయిర్‌టెల్‌ 13,18,251 మంది చందాదారులను సంపాదించుకుంది. మొత్తం  చందాదారుల సంఖ్య 35.52 కోట్లుగా ఉంది. ఈ సంస్థ అక్టోబర్‌లో నికరంగా చందాదారులను నష్టపోవడం గమనార్హం.  

♦వొడాఫోన్‌ ఐడియా 18,97,050 కస్టమర్లు కోల్పోయింది. ఈ సంస్థ మొత్తం చందాదారులు 26.7 కోట్లకు పరిమితమయ్యారు. 

♦బీఎస్‌ఎన్‌ఎల్‌ 2,40,062 మంది మొబైల్‌ కస్టమర్లను కోల్పోయింది.  

♦ఎంటీఎన్‌ఎల్‌ 4,318 కనెక్షన్లను నష్టపోయింది. 

♦ఫిక్స్‌డ్‌ లైన్‌ కనెక్షన్లు 2.35 కోట్లు పెరిగాయి. రిలయన్స్‌ జియో 2,07,114, ఎయిర్‌టెల్‌ 1,30,902 కనెక్షన్లను సంపాదించుకున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ 77,434 కనెక్షన్లను కోల్పోయింది. 

♦బ్రాడ్‌బ్యాండ్‌ చందాదారుల సంఖ్య 80.16 కోట్లకు చేరుకుంది. అక్టోబర్‌ చివరికి ఇది 79.89 కోట్లుగా నమోదైంది.

మరిన్ని వార్తలు