ఒక్కరోజులో ఒక్కరూపాయి-100ఎంబీ డేటా ప్యాక్‌ తుస్స్‌! కారణం ఇదే.

17 Dec, 2021 08:11 IST|Sakshi

 కేవలం ఒక్క రూపాయికే 100ఎంబీ ఇంటర్నెట్‌ డేటా.. అదీ 30 రోజుల వాలిడిటీ ప్రకటనతో టెలికాం రంగంలోనే సంచలనానికి తెర లేపింది రిలయన్స్‌ జియో. అయితే ఒక్క రోజులోనే ఉస్సూరుమనిపిస్తూ ఆ ఆఫర్‌ను సవరించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. 


మంగళవారం రాత్రి దాటాక మైజియో మొబైల్‌ యాప్‌లో గప్‌చుప్‌గా వాల్యూ ప్లాన్‌ కింద ఈ ఆఫర్‌ను చేర్చింది జియో. ఒక్క రూపాయికే 100 ఎంబీ డేటాను, 30 రోజుల వాలిడిటీతో అందించింది. అయితే 24 గంటల తర్వాత ఆ ప్లాన్‌ మాయమైంది. దాని ప్లేస్‌లో 1రూ. రీచార్జ్‌తో కేవలం 10 ఎంబీ.. అదీ ఒక్కరోజూ వాలిడిటీతో సవరించింది. దీంతో చాలామంది రిలయన్స్‌ జియో ప్రకటన వార్తలను ఫేక్‌గా భావించారు. అయితే జియో ఈ ప్యాక్‌ను ఆఫర్‌ చేసిన విషయం వందకు వంద శాతం వాస్తవం. 


ప్యాక్‌ ఎందుకు సవరించారనే దానిపై రిలయన్స్‌ జియో నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, తోటి టెలికామ్‌ సంస్థల నుంచి వచ్చిన అభ్యంతరాలే జియో వెనక్కి తగ్గడానికి కారణమని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో టెలికాం కంపెనీలన్నీ(జియో)తో సహా టారిఫ్‌లను పెంచేశాయి. ఈ క్రమంలో ఒకదానిపై ఒకటి ఫిర్యాదులు చేసుకున్నాయి కూడా. అయితే  ఏ టెలికాం సంస్థ కూడా ఇంత చీప్‌గా డేటా ప్యాక్‌ను ఆఫర్‌ చేయట్లేదన్న విషయాన్ని సైతం టెలికాం రెగ్యులేటరీ బాడీ ‘ట్రాయ్‌’ జియో మేనేజ్‌మెంట్‌ వద్ద లేవనెత్తినట్లు ట్రాయ్‌ అధికారి ఒకరు వెల్లడించారు. 

ఈ అభ్యంతరాల నేపథ్యంలో జియో తన చీపెస్ట్‌ ఇంటర్నెట్‌ ప్యాక్‌ను సైలెంట్‌గా మార్చేసింది. అయితే ఆ సమయానికి ఎవరైతే 1రూ. 100 ఎంబీ ప్యాక్‌కు రీఛార్జ్‌ చేశారో వాళ్లకు మాత్రం ప్లాన్‌ను వర్తింపజేస్తూ జియో ఊరట ఇచ్చింది.

చదవండి: జియో యూజర్లకు 20 శాతం క్యాష్‌బ్యాక్‌! ఎలాగంటే..

>
మరిన్ని వార్తలు