కస్టమర్లు పోర్ట్‌ కాకుండా వొడాఫోన్‌-ఐడియా అడ్డుపుల్ల.. ట్రాయ్‌ దగ్గరికి పంచాయితీ!

2 Dec, 2021 16:09 IST|Sakshi

టెలికాం కంపెనీలన్నీ ఈ మధ్య వరుసబెట్టి టారిఫ్‌ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే రకరకాల బాదుడులతో నలిగిపోతున్న సామాన్యులకు.. ఈ పెంపుతో మరో పిడుగు పడినట్లయ్యింది. అయితే ఇందులో ఇప్పుడు ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వొడాఫోన్‌-ఐడియా(VIL) మీద రిలయన్స్‌ జియో ఏకంగా ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది తాజాగా..


వొడాఫోన్‌ ఐడియా తాజాగా 18-25 శాతం రేట్లను పెంచేసిన విషయం తెలిసిందే. అయితే తాజా టారిఫ్‌ ప్యాకేజీలో ఎంట్రీ లెవల్‌ కస్టమర్లను తమకు నచ్చిన నెట్‌వర్క్‌కు పోర్ట్ ద్వారా మారేందుకు వీలులేకుండా చేసిందనేది జియో ఆరోపణ. 

సాధారణంగా ఒక కస్టమర్‌ తన నెంబర్‌ నుంచి పోర్ట్ కావాలంటే పోర్ట్‌ రిక్వెస్ట్‌ ఎస్సెమ్మెస్‌ పంపించాలనే విషయం తెలిసిందే కదా. అయితే వొడాఫోన్‌లో ఎంట్రీ లెవల్‌ రీఛార్జ్‌ ప్యాక్‌లో ఎస్సెమ్మెస్‌ పంపే వీలు లేకుండా పోయింది తాజా టారిఫ్‌లో. రూ.75 నుంచి 99రూ.కి 28 రోజుల వాలిడిటీ ప్యాక్‌ రేటును పెంచిన VIL.. అందులో ఎస్సెమ్మెస్‌ ఆఫర్‌ లేకుండా చేసింది. ఇక మెసేజ్‌లు పంపుకోవాలంటే రూ.179, అంతకంటే ఎక్కువ ప్యాకేజ్‌తో రీఛార్జ్‌ చేయాల్సిందే. సో.. పోర్ట్‌ మెసేజ్‌ పంపాలన్నా వొడాఫోన్‌ ఐడియా కస్టమర్లు కచ్చితంగా 179రూ.తో ముందు రీఛార్జ్‌ చేసుకోవాలన్నమాట. 

ఇలా అత్యధిక ప్యాకేజీ రీఛార్జ్‌తో వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌, కన్జూమర్‌ని తనకు నచ్చిన నెట్‌వర్క్‌కు పోర్ట్‌ కాకుండా అడ్డుకుంటోందని జియో తన ఫిర్యాదులో పేర్కొంది. 

జియో కంటే ముందు  స్వచ్ఛంద సంస్థ ‘టెలికాం వాచ్‌డాగ్‌’ కూడా ట్రాయ్‌ Telecom Regulatory Authority of India కు ఇదే విషయమై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కన‍్జూమర్‌ హక్కుల్ని పరిరక్షించాల్సిన  ట్రాయ్‌ ..ఈ విషయాన్ని ఎలా పరిగణనలోకి తీసుకోలేదో అర్థం కావట్లేదంటూ ఫిర్యాదులో పేర్కొంది కూడా.

చదవండి: ‘ట్రాయ్‌ నిద్రపోతోందా?’.. జనాగ్రహం ఎంతలా ఉందంటే..

మరిన్ని వార్తలు