జియో కీలక ప్రకటన.. ఆ 4 నగరాల్లో 5జీ సేవలు!

4 Oct, 2022 19:46 IST|Sakshi

జియో యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. దేశంలో 5జీ సేవలకు సంబంధించి రిలయన్స్‌ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, వారణాసి నగరాల్లో అక్టోబర్‌ 5 నుంచి 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ప్రయోగాత్మకంగా మొదట ఈ 4 నగరాల్లో సేవలు అందించి.. ఆపై మిగతా నగరాలకు సేవలను విస్తరిస్తామని తెలిపింది.

కాగా అక్టోబర్ 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 ఎగ్జిబిషన్‌లో 5జీ సేవలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీపావళికి సందర్భంగా జియో సేవలని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన జియో దసరా పర్వదినాన నాలుగు నగరాల్లో జియో ట్రూ 5జీ (Jio True 5G) సేవలు ప్రారంభించింది. ప్రస్తుతం పేర్కొన్న నగరాలలో జియో ట్రూ 5జీ వెల్‌కం ఆఫర్‌ కింద కస్టమర్లకు బీటా ట్రయల్‌ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. 

ఈ ఆఫర్‌ కింద వినియోగదారులు 5జీ అపరిమిత డేటాను 1జీబీపీఎస్‌ స్పీడ్‌తో పొందవచ్చు. జియో వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద ఉన్న యూజర్లు ఆటోమేటిక్‌గా జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని, దీనికోసం జియో సిమ్‌గానీ, 5జీ హ్యాండ్‌సెట్‌గానీ మార్చాల్సిన అవసరం లేదని పేర్కొంది.

మరిన్ని వార్తలు