ఆర్‌ఐఎల్‌కు భారీ నిధులు

7 Jan, 2022 04:08 IST|Sakshi

విదేశీ కరెన్సీ బాండ్ల జారీ

రూ. 30,000 కోట్ల సమీకరణ

3 కాలావధులతో బాండ్ల విక్రయం

గరిష్ట ఫారెక్స్‌ బాండ్ల జారీతో తొలి దేశీ కంపెనీగా రికార్డ్‌

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) విదేశీ కరెన్సీ బాండ్ల జారీ ద్వారా 4 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 30,000 కోట్లు) సమీకరించింది. తద్వారా గరిష్టస్థాయిలో ఫారెక్స్‌ బాండ్లను జారీ చేసిన తొలి దేశీ కార్పొరేట్‌గా నిలిచింది. మూడు దశలలో జారీ చేసిన ఈ బాండ్ల ద్వారా సమకూర్చుకున్న నిధులను రుణ చెల్లింపులకు వినియోగించే ప్రణాళికల్లో ఉంది. ఫిబ్రవరిలో గడువు తీరనున్న 1.5 బిలియన్‌ డాలర్ల రుణం దీనిలో కలసి ఉన్నట్లు తెలుస్తోంది. ఫారెక్స్‌ బాండ్ల ఇష్యూకి దాదాపు 3 రెట్లు అధిక రెస్పాన్స్‌ లభించినట్లు ఆర్‌ఐఎల్‌ పేర్కొంది. వెరసి 11.5 బిలియన్‌ డాలర్లమేర డిమాండ్‌ కనిపించినట్లు వెల్లడించింది.   

అతిపెద్ద ఇష్యూగా రికార్డు...
ఆర్‌ఐఎల్‌ తాజా నిధుల సమీకరణ దేశంలోనే అతిపెద్ద విదేశీ కరెన్సీ బాండ్‌ లావాదేవీగా నమోదైంది. గతంలో పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్‌జీసీ విదేశ్‌ లిమిటెడ్‌ 2014లో చేపట్టిన 2.2 బిలియన్‌ డాలర్ల ఫారెక్స్‌ బాండ్ల ఇష్యూ ఇప్పటివరకూ రికార్డుగా నమోదైంది. ఆర్‌ఐఎల్‌ 2.875 శాతం కూపన్‌ రేటుతో 10 ఏళ్ల కాలపరిమితి బాండ్ల జారీ ద్వారా 1.5 బిలియన్‌ డాలర్లను సమీకరించింది. ఈ బాటలో 3.625 శాతం రేటుతో 30ఏళ్ల కాలావధిగల బాండ్ల జారీ ద్వారా 1.75 బిలియన్‌ డాలర్లను అందుకుంది.

ఇదేవిధంగా 3.75 శాతం రేటుతో 40 ఏళ్ల బాండ్ల జారీ ద్వారా 0.75 బిలియన్‌ డాలర్లను సమకూర్చుకుంది. జపాన్‌ వెలుపల బీబీబీ రేటింగ్‌ కలిగిన ఒక ఆసియా కంపెనీ 40 ఏళ్ల కాలపరిమితిగల డాలర్‌ బాండ్లను జారీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం! మూడు కాలావధులుగల ఈ బాండ్ల గడువు 2032–2062 మధ్య కాలంలో ముగియనుంది. యూఎస్‌ ట్రెజరీలతో వీటి కూపన్‌(వడ్డీ) రేట్లు అనుసంధానమై ఉన్నట్లు ఆర్‌ఐఎల్‌ పేర్కొంది. తద్వారా వీటి కూపన్‌ రేట్లను ట్రెజరీలకంటే 1.2 శాతం, 1.6 శాతం, 1.7 శాతం చొప్పున అధికంగా నిర్ణయించినట్లు తెలియజేసింది. అంతేకాకుండా అతితక్కువ కూపన్‌ రేటుతో వీటిని జారీ చేసినట్లు తెలియజేసింది.    

డన్‌జోలో రిలయన్స్‌ రిటైల్‌కు వాటాలు
     25.8 శాతం కొనుగోలు
     డీల్‌ విలువ రూ. 1,488 కోట్లు

దేశీ రిటైల్‌ దిగ్గజం రిలయన్స్‌ రిటైల్‌.. ఆన్‌లైన్‌ నిత్యావసర సరుకుల డెలివరీ విభాగంలో కార్యకలాపాలు విస్తరించడంపై మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా క్విక్‌ కామర్స్‌ సంస్థ డన్‌జోలో 25.8 శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ 200 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 1,488 కోట్లు). ప్రస్తుత ఇన్వెస్టర్లు లైట్‌బాక్స్, లైట్‌రాక్, 3ఎల్‌ క్యాపిటల్, అల్టీరియా క్యాపిటల్‌ కూడా ఈ విడతలో మరికొంత పెట్టుబడులు పెట్టాయి.  రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ నిర్వహించే రిటైల్‌ స్టోర్లకు అవసరమయ్యే హైపర్‌లోకల్‌ లాజిస్టిక్స్‌ సర్వీసులు కూడా డన్‌జో అందిస్తుంది. అలాగే జియోమార్ట్‌ వ్యాపారుల నెట్‌వర్క్‌కు డెలివరీల సదుపాయాలు కూడా కల్పిస్తుంది.

>
మరిన్ని వార్తలు