వజ్రోత్సవాల వేళ ఆంటిలియాకు కొత్త కళ: మనవడితో అంబానీ సందడి

15 Aug, 2022 11:20 IST|Sakshi

సాక్షి, ముంబై: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా  జరుగు తున్నాయి. దేశవ్యాప్తంగా పిల్లా పెద్దా అంతా త్రివర్ణ పతాకాలు చేబూని,  మాతృదేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమర యోధుల  త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్‌ అంబానీ కూడా ఈ సంబరాల్లో పాలు పంచుకున్నారు. భార్య నీతా అంబానీ, మనవడు పృథ్వీ అంబానీతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా దేశంలోని చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలు త్రివర్ణ కాంతులతో దేదీప్యమానంగా ఆకర్ణణీయంగా మారిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలోనే దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేశ్‌ అబానీ ఇల్లు ఆంటిలియా కూడా త్రివర్ణ పతాక  కాంతులతో వెలిగిపోతోంది. యాంటిలియా వెలుపల ఉన్న రహదారి మొత్తం త్రివర్ణ   వెలుగులతో అందంగా ముస్తాబు  చేశారు. దీంతో జనం తమ కార్లను ఆపి మరీ సెల్ఫీలు తీసుకోవడం విశేషం. అంతేకాదు ఆంటిలియా ఇంటి బయట శీతల పానీయాలు, చాక్లెట్లు  అందిస్తున్నారు. దీంతో అటు సెల్ఫీలు, ఇటు కూల్‌ డ్రింక్స్‌,  చాక్లెట్లతో జనం ఎంజాయ్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు