రిలయన్స్, ఓఎన్‌జీసీకి బొనాంజా

31 Mar, 2022 05:38 IST|Sakshi

రెట్టింపు కానున్న గ్యాస్‌ ధర

న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలు ఏప్రిల్‌ 1 నుంచి మారనున్నాయి. గతేడాది కాలంగా ఇంధన ధరలు గణనీయంగా ఎగియడాన్ని పరిగణనలోకి తీసుకోనుండటంతో రేట్లు భారీగా పెరగనున్నాయి. దీంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ తదితర గ్యాస్‌ ఉత్పత్తి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. ఓఎన్‌జీసీకి నామినేషన్‌ ప్రాతిపదికన కేటాయించిన క్షేత్రాల నుంచి వెలికితీసే గ్యాస్‌ రేటు ప్రస్తుత 2.9 డాలర్ల నుంచి 5.93 డాలర్లకు (యూనిట్‌ – ఎంబీటీయూ) పెరగనుంది.

అలాగే రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థ బీపీకి చెందిన కేజీ–డీ6 బ్లాక్‌లో సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌ ధర 6.13 డాలర్ల నుంచి 9.9–10.1 డాలర్లకు పెరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2019 ఏప్రిల్‌ తర్వాత ఈ గ్యాస్‌ రేట్లు పెరగడం ఇది రెండోసారి. అమెరికా, రష్యా తదితర గ్యాస్‌ మిగులు దేశాల్లో నిర్దిష్ట కాలంలో ధరలకు అనుగుణంగా దేశీయంగా సహజ వాయువు రేట్లను కేంద్రం ఆర్నెల్లకోసారి (ఏప్రిల్‌ 1, అక్టోబర్‌ 1) రేట్లను సవరిస్తుంది.

ప్రస్తుతం 2021 జనవరి–డిసెంబర్‌ మధ్య కాలంలో అంతర్జాతీయంగా గ్యాస్‌ ధరలను బట్టి ఈ ఏడాది ఏప్రిల్‌ 1–సెప్టెంబర్‌ 30 మధ్య కాలానికి ప్రభుత్వం రేటు నిర్ణయించనుంది. గతేడాది రేటు భారీగా పెరిగిపోవడంతో ఆ ప్రభావం ఈ ఏడాది నిర్ణయించే గ్యాస్‌ ధరలపై పడనుంది. గ్యాస్‌ రేటు పెరగడం వల్ల ఎరువుల ఉత్పత్తి వ్యయం పెరగనుంది. అయితే, ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తున్నందున రేట్ల పెంపు పెద్దగా ఉండకపోవచ్చు. అలాగే, విద్యుదుత్పత్తి వ్యయాలూ పెరిగినా.. దేశీయంగా గ్యాస్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ఎక్కువగా లేనందున.. వినియోగదారులపై అంతగా ప్రభావం ఉండదు.

మరిన్ని వార్తలు