నాయకత్వ మార్పిడి కసరత్తు నడుస్తోంది

29 Dec, 2021 05:33 IST|Sakshi

ఆకాశ్, ఇషా, అనంత్‌ ప్రతిభపై అనుమానం లేదు

రిలయన్స్‌ను మరిన్ని శిఖరాలకు తీసుకెళతారు

సంస్థ అధినేత ముకేశ్‌ అంబానీ  బహుళజాతి సంస్థగా అవతరిస్తామని ప్రకటన

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత సంపన్నుడైన ముకేశ్‌ అంబానీ (64) తన వారసులకు ‘రిలయన్స్‌’ సామ్రాజ్యాన్ని అప్పగించే పనిని ప్రారంభించినట్టు ప్రకటించారు. తనతో సహా సీనియర్లతో కలసి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. వారసత్వ ప్రణాళికల గురించి అంబానీ మాట్లాడడం ఇదే మొదటిసారి. ముకేశ్‌ అంబానీకి కవలలు ఆకాశ్, ఇషాతోపాటు అనంత్‌ ఉన్నారు.

రిలయన్స్‌ కుటుంబ దినం సందర్భంగా ముకేశ్‌ అంబానీ మాట్లాడారు. రిలయన్స్‌ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ధీరూభాయి అంబానీ వర్ధంతి నాడు కుటుంబ దినం జరుపుకుంటూ ఉంటారు. రానున్న సంవత్సరాల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రపంచంలోనే అత్యంత బలమైన, ప్రసిద్ధి చెందిన భారత బహుళజాతి సంస్థగా అవతరిస్తుందన్నారు. శుద్ధ, గ్రీన్‌ ఎనర్జీలోకి ప్రవేశించడంతోపాటు.. రిటైల్, టెలికం వ్యాపారాలతో అసాధారణ స్థాయికి రిలయన్స్‌ చేరుకుంటుందని చెప్పారు.

సరైన నాయకత్వంతోనే సాధ్యం..
‘‘పెద్ద కలలు, అసాధారణమనుకునే లక్ష్యాలు సరైన వ్యక్తులు, సరైన నాయకత్వంతోనే సాధ్యపడతాయి. రిలయన్స్‌ ఇప్పుడు ముఖ్యమైన, నాయకత్వ మార్పిడిలో ఉంది. సీనియర్లు అయిన నాతరం నుంచి.. యువ నాయకులైన తదుపరి తరానికి బదిలీ కానుంది. ఎంతో పోటీవంతమైన, ఎంతో అంకితభావం కలిగిన, అద్భుతమైన యువ నాయకత్వం రిలయన్స్‌లో ఉంది. మేము వారిని ప్రోత్సహించి నడిపించాలి. వారి వెనుకనుండి.. వారు మాకంటే మెరుగ్గా పనిచేస్తుంటే వెన్నుతట్టి ప్రోత్సహించాలి’’ అని అన్నారు.  

ఉన్నత శిఖరాలకు తీసుకెళతారు
‘‘ఆకాశ్, ఇషా, అనంత్‌ తదుపరి తరం నాయకులు. వారు రియలన్స్‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే విషయంలో నాకు ఏ మాత్రం సందేహం లేదు. దిగ్గజ పారిశ్రామికవేత్త ధీరూభాయి అంబానీ మాదిరే వారిలోనూ ఎంతో చురుకుదనం, సామర్థ్యాలున్నాయి. రిలయన్స్‌ను మరింత విజయవంతంగా నడిపించాలని మనమందరం కోరుకుందాం’’ అని ముకేశ్‌ పేర్కొన్నారు. ప్రసంగంలో ఇషా భర్త ఆనంద్‌ పిరమల్, ఆకాశ్‌ భార్య శ్లోక, అనంత్‌కు కాబోయే భార్యగా ప్రచారంలో ఉన్న రాధిక పేర్లను అంబానీ ప్రస్తావించడం గమనార్హం.  

భవిష్యత్తుకు పునాది రాళ్లు
రానున్న దశాబ్దాల్లో అపార అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుగా రిలయన్స్‌ భవిష్యత్తు వృద్ధికి పునాదులు వేయాల్సిన సమయం ఇదేనని అంబానీ అన్నారు. ‘‘రిలయన్స్‌ తన స్వర్ణ దశాబ్దం రెండో భాగంలోకి అడుగుపెట్టింది. భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉంటుందని చెప్పగలను. ప్రపంచ టాప్‌–3 ఆర్థిక వ్యవస్థల్లోకి భారత్‌ చేరుతుంది. రిలయన్స్‌ ప్రముఖ బహుళజాతి సంస్థగా అవతరిస్తుంది’’ అని అంచనాలను వ్యక్తీకరించారు.

>
మరిన్ని వార్తలు