రిలయన్స్‌ చేతికి జస్ట్‌ డయల్‌

17 Jul, 2021 03:01 IST|Sakshi

41 శాతం వాటాల కొనుగోలు

డీల్‌ విలువ రూ. 3,497 కోట్లు

మరో 26% వాటాకు ఓపెన్‌ ఆఫర్‌

న్యూఢిల్లీ: దేశీ ఆన్‌లైన్‌ కామర్స్‌ మార్కెట్‌లో మరింత పట్టు సాధించే దిశగా రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) .. తాజాగా లోకల్‌ సెర్చి ఇంజిన్‌ జస్ట్‌ డయల్‌లో 40.95% వాటాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్‌ విలువ రూ. 3,497 కోట్లని శుక్రవారం వెల్లడించింది. సెబీ టేకోవర్‌ నిబంధనల ప్రకారం మరో 26% వాటా (సుమారు 2.17 కోట్ల షేర్లు) కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించనున్నట్లు ఎక్సే్చంజీలకు తెలిపింది. కంపెనీ తదుపరి వృద్ధి లక్ష్యాల సాధనకు తోడ్పడేలా జస్ట్‌డయల్‌ వ్యవస్థాపకుడు వీఎస్‌ఎస్‌ మణి ఇకపైనా మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవోగా కొనసాగుతారని ఆర్‌ఆర్‌వీఎల్‌ తెలిపింది.

జస్ట్‌ డయల్‌లో ఇన్వెస్ట్‌ చేసే నిధులతో కంపెనీ సమగ్రమైన లోకల్‌ లిస్టింగ్, కామర్స్‌ ప్లాట్‌ఫాంగా కార్యకలాపాలు విస్తరించగలదని పేర్కొంది. లక్షల కొద్దీ లఘు, చిన్న, మధ్య స్థాయి భాగస్వామ్య వ్యాపార సంస్థలకు డిజిటల్‌ ఊతమిచ్చేందుకు ఈ డీల్‌ ఉపయోగపడగలదని ఆర్‌ఆర్‌వీఎల్‌ డైరెక్టర్‌ ఈషా అంబానీ తెలిపారు. తమ లక్ష్యాల సాధనకు, వ్యాపార పురోగతికి రిలయన్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం దోహదపడగలదని వీఎస్‌ఎస్‌ మణి తెలిపారు.  


డీల్‌ స్వరూపం ఇలా..: ఆర్‌ఆర్‌వీఎల్, జస్ట్‌డయల్, వీఎస్‌ఎస్‌ మణి, ఇతరుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 2.12 కోట్ల ఈక్విటీ షేర్లను రూ. 1,022.25 రేటు చొప్పున ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన ఆర్‌ఆర్‌వీఎల్‌కు కేటాయిస్తారు. అలాగే వీఎస్‌ఎస్‌ మణి నుంచి షేరు ఒక్కింటికి రూ. 1,020 రేటు చొప్పున ఆర్‌ఆర్‌వీఎల్‌ 1.31 కోట్ల షేర్లను కొనుగోలు చేస్తుంది.  
జస్ట్‌డయల్‌ కార్యకలాపాలు 1996లో ప్రారంభమయ్యాయి. మొబైల్, యాప్స్, వెబ్‌సైట్, టెలిఫోన్‌ హాట్‌లైన్‌ వంటి  మాధ్యమాల ద్వారా జస్ట్‌డయల్‌ సర్వీసులను పొందే యూజర్ల సంఖ్య మూడు నెలల సగటు సుమారు 13 కోట్ల దాకా ఉంటుంది.

మరిన్ని వార్తలు