రిలయన్స్ : "నెట్‌మెడ్స్" డీల్

19 Aug, 2020 09:11 IST|Sakshi

ప్రముఖ డిజిటల్ ఫార్మా ‘నెట్‌మెడ్స్’లో రిలయన్స్ రిటైల్ మెజారిటీ వాటా

సాక్షి, ముంబై: ఒప్పందాల దూకుడును ప్రదర్శిస్తున్న ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తాజాగా ఆన్‌లైన్ ఫార్మసీ సంస్థ నెట్‌మెడ్స్ తో మరో డీల్ కుదుర్చుకుంది. 620 కోట్ల రూపాయల విలువైన మేజర్ వాటాను సొంతం చేసుకుంది. తన అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌విఎల్) వైటాలిక్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 60 శాతం మెజారిటీ ఈక్విటీ వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అలాగే  ట్రెసారా హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, నెట్‌మెడ్స్ మార్కెట్ ప్లేస్ లిమిటెడ్ దాదా ఫార్మా డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా దాని అనుబంధ సంస్థల 100 శాతం ప్రత్యక్ష ఈక్విటీ యాజమాన్యాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ-కామర్స్‌ దిగ్గజ కంపెనీ అయిన అమెజాన్‌కి ఇకపై రిలయన్స్ ఇండస్ట్రీస్ గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (అంబానీ సంచలన నిర్ణయం)

భారతదేశం అంతటా అధిక నాణ్యత, సరసమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, సేవల లభ్యతను పెంచడానికి కట్టుబడి ఉన్నామని ఆర్‌ఆర్‌విఎల్ డైరెక్టర్ ఇషా అంబానీ వెల్లడించారు. ఇంత తక్కువ సమయంలో దేశవ్యాప్తంగా డిజిటల్ ఫ్రాంచైజీకి  నిర్మాణంలో నెట్‌మెడ్స్ కృషి తమను ఆకట్టుకుందని,  దీన్ని  మరింత వేగవంతం చేస్తామనే నమ్మకంతో ఉన్నామని తెలిపారు.  డిజిటల్ వ్యాపారాన్ని మరింత విస్తరించగం. వినియోగదారులకు రోజువారీ కావాల్సిన వాటిని మరింత ఎక్కువగా అందించగలమని ఆమె తెలిపారు. “నెట్‌మెడ్స్” రిలయన్స్ కుటుంబంలో చేరడం,  ప్రతి భారతీయుడికి నాణ్యమైన ఆరోగ్య  ఉత్పత్తులను అందించే దిశలో  కలిసి పనిచేయడం నిజంగా గర్వకారణమని నెట్‌మెడ్స్ వ్యవస్థాపకుడు,  సీఈఓ ప్రదీప్ దాదా  సంతోషం వ్యక్తం చేశారు.

ప్రదీప్ దాదా స్థాపించిన నెట్‌మెడ్స్ (వైటాలిక్ అనుబంధ సంస్థలు ‘నెట్‌మెడ్స్’ అని పిలుస్తారు)ఇ-ఫార్మా పోర్టల్. వెబ్‌సైట్, యాప్ ద్వారా ఫార్మా ఉత్పత్తులను డెలివరీ చేస్తుంది. కాగా గత వారం అమెజాన్ ఇండియా బెంగళూరులో ఈ-ఫార్మసీ సర్వీసులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ  పోటీలో రిలయన్స్ కూడా చేరడం విశేషం.

మరిన్ని వార్తలు