ఫ్యూచర్‌తో రిలయన్స్‌ ఒప్పందం గడువు పెంపు

2 Oct, 2021 06:13 IST|Sakshi

2022 మార్చి 31 వరకూ ‘లాంగ్‌ స్టాప్‌ డేట్‌’  

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, సింగపూర్‌ ఆర్ర్‌బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌లో న్యాయ పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో ఫ్యూచర్‌ గ్రూప్‌తో రూ.24,713 కోట్ల ఒప్పంద పక్రియ పూర్తికి గడువును (లాంగ్‌ స్టాప్‌ డేట్‌) రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రిటైల్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) మరోసారి పొడిగించింది. ఇప్పటి వరకూ 2021 సెపె్టంబర్‌ 30తో గడువు పూర్తికాగా, దీనిని 2022 మార్చి వరకూ ఆర్‌ఆర్‌వీఎల్‌ పొడిగించినట్లు ఫ్యూచర్‌ రిటైల్‌ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌ సమర్పించింది.  

సుదీర్ఘ న్యాయ వివాదం
రిలయన్స్‌కు ఫ్యూచర్‌ గ్రూప్‌ల ఆస్తుల విక్రయానికి సంబంధించి రూ.24,713 కోట్ల ఒప్పందం వివాదం ప్రస్తుతం సింగపూర్‌ అర్ర్‌బిటేషన్, సుప్రీంకోర్టు న్యాయపరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యూచర్‌ కూపన్స్‌లో వాటాదారైన అమెజాన్‌కు.. ఎఫ్‌ఆర్‌ఎల్‌లో కూడా కొన్ని వాటాలు ఉన్నాయి. అప్పటి ఒప్పందం ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కొనుగోలు చేసే హక్కులు కూడా దఖలు పడ్డాయన్నది అమెజాన్‌ వాదన. మరోవైపు, 2020 ఆగస్టులో తమ రిటైల్‌ తదితర వ్యాపారాలను రిలయన్స్‌ రిటైల్‌కు విక్రయించేలా ఫ్యూచర్‌ గ్రూప్‌ ఒప్పందం ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్‌ ఫ్యూచర్‌ గ్రూప్‌నకు లీగల్‌ నోటీసులు పంపింది.

అటుపైన సింగపూర్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అవి భారత్‌లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్‌ గ్రూప్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్‌ జడ్జి అమెజాన్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వగా.. వాటిపై డివిజనల్‌ బెంచ్‌ స్టే విధించింది. ఈ పరిణామాలను సవాలు చేస్తూ అమెజాన్‌.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇక్కడ అమెజాన్‌కు అనుకూలంగా రూలింగ్‌ వచి్చంది. ఆర్ర్‌బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ అవార్డు భారత్‌ చట్టాల ప్రకారం చెల్లుబాటు అవుతుందని ఇటీవలే ఒక రూలింగ్‌ ఇచి్చంది. పూర్తి వివాదం అంశంలో ఇంకా తుది తీర్పు వెలువడాల్సి ఉంది.  దేశంలో లక్ష కోట్ల రిటైల్‌ వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలన్నదే ఆయా సంస్థల న్యాయపోరాటం  ప్రధాన ధ్యేయమన్న విమర్శలు ఉన్నాయి.  

ఈజీఎం నిర్వహణకు ఫ్యూచర్‌కు వెసులుబాటు...
మరోవైపు ఈ ఒప్పందానికి ఆమోదం కోసం వాటాదారులు, రుణదాతల అసాధారణ  సమావేశం (ఈజీఎం) నిర్వహించడానికి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఇటీవల కిషోర్‌ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌ గ్రూప్‌కు అనుమతి ఇచి్చంది.  సంబంధిత వర్గాల కథనం ప్రకారం ఒకవేళ ఫ్యూచర్‌ జరిపే ఈజీఎం గ్రూప్‌ సంస్థల విక్రయానికి ఆమోదముద్ర వేసినప్పటికీ, సంబంధిత స్కీమ్‌కు ఎన్‌సీఎల్‌టీ తుది ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుందని ట్రిబ్యునల్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. ఈ దశలో తన అభ్యంతరాలను అమెజాన్‌ ఎన్‌సీఎల్‌టీ ముందు ఉంచవచ్చని అభిప్రాయపడింది.

అందువల్ల ఇప్పుడు ఫ్యూచర్‌ నిర్వహించే సమావేశం సరికాదనడం తప్పని ఎన్‌సీఎల్‌టీ పేర్కొంది. దీనివల్ల తక్షణం అమెజాన్‌కు జరిగే న్యాయపరమైన నష్టం ఏదీ లేదని స్పష్టం చేసింది. ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీల విలీన పథకాన్ని ఆమోదిస్తూ, తుది ఉత్తర్వుఇవ్వవద్దని మాత్రమే సుప్రీంకోర్టు తనను ఆదేశించినట్లు వివరించింది. ఫ్యూచర్‌ ఈజీఎంను నిర్వహించి పథకానికి ముందుగానే ఆమోదముద్ర పొందినట్లయితే, ‘తరువాత ఆర్ర్‌బిట్రేషన్‌ పక్రియలో విజయం సాధిస్తే’ రిలయన్స్‌తో ఒప్పందం ప్రక్రియ పూర్తికి ఐదారు నెలల సమయం ఆదా అవుతుందనీ వివరించింది. 

మరిన్ని వార్తలు